క్రికెట్ వరల్డ్ కప్ భారత జట్టులో మరో ముగ్గురు...
ప్రపంచ కప్ క్రికెట్ పోటీల కోసం భారత జట్టుకు మరో ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎస్కే ప్రసాద్ వెల్లడించారు. మే నెలలో జరుగనున్న ప్రపంచ కప్ క్రికెట్ పోటీల కోసం ఏప్రిల్ 23వ తేదీలోపు జట్టును ప్రకటించాల్సివుంది. ఇందుకోసం జట్టు సభ్యుల ఎంపికలో సెలెక్టర్లు బిజీగా ఉన్నారు.
ఇప్పటికే ఒకటి, రెండు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాలకు దాదాపుగా ఆటగాళ్ళ ఎంపిక ఖరారైంది. అయితే తాజాగా మరో ముగ్గురి పేర్లను టీమ్ కోసం పరిశీలిస్తున్నారు. వీరిలో ధోనీ వారసుడిగా గుర్తింపు పొందిన రిషబ్ పంత్‌తోపాటు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే పేర్లు వినిపిస్తున్నాయి.
టెస్టుల్లో ఇప్పటికే తన సత్తా నిరూపించుకున్నాడు పంత్... ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి పిచ్‌లపై కఠినమైన పరిస్థితుల్లోనూ రెండు సెంచరీలు కూడా చేశాడు. వన్డేలు, టీ20ల్లో మాత్రం ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. అటు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ బాల్‌తో ఇంకా పూర్తి స్థాయిలో రాణించకపోయినా.. బ్యాట్‌తో మాత్రం బాగానే ఆకట్టుకుంటున్నాడు.
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శంకర్.. కొన్ని భారీ షాట్లతో అలరించాడు. మూడో టీ20లో టీమ్ ఓడినా.. విజయ్ మాత్రం 28 బంతుల్లోనే 43 పరుగులు చేయడం విశేషం. ఈ స్థాయిలో ఉండాల్సిన నైపుణ్యాన్ని అతడు చూపిస్తున్నాడు. భారత్ 'ఏ' జట్టు చేపట్టే పర్యటనలతో అతన్ని మరింత రాటుదేలుస్తున్నాం. అయితే ప్రస్తుత టీమ్‌లో అతడు ఎక్కడ సరిపోతాడన్నది చూడాలి అని ప్రసాద్ చెప్పాడు.
ఇకపోతే, గత యేడాది సౌతాఫ్రికాతో చివరిసారి వన్డే మ్యాచ్ ఆడిన రహానే పేరును కూడా మూడో ఓపెనర్‌గా పరిశీలిస్తున్నట్టు ప్రసాద్ వెల్లడించారు. దేశవాళీ క్రికెట్‌లో రహానే బాగా రాణిస్తున్నాడని, అందుకే వరల్డ్‌కప్ టీమ్ రేసులో అతనూ ఉన్నాడని ప్రసాద్ తెలిపాడు. కాగా, ఈ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5వ తేదీన సౌతాఫ్రికాతో ఆడనుంది.