సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (14:21 IST)

మళ్లీ వస్తున్నా : రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గిన అంబటి రాయుడు

ఐసీసీ వరల్డ్ క్రికెట్ కప్ సమయంలో ప్రతి ఒక్కరీనీ ఆశ్చర్యానికి గురిచేస్తూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్టు యువ క్రికెటర్ అంబటి రాయుడు ప్రకటించారు. అయితే, ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. మళ్లీ బ్యాట్ పట్టి మైదానంలోకి దిగనున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ సంఘానికి రాసిన లేఖలో స్పష్టం చేశాడు. అన్ని ఫార్మాట్లలో ఆడతానని రాయుడు తన లేఖలో పేర్కొన్నాడు.
 
వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో తనకు చోటు కల్పించకపోవడం పట్ల రాయుడు భారత సెలెక్టర్ల బృందంపై అలకబూనిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పైనా సెటైర్ వేసి ఇబ్బందుల్లో పడ్డాడు. పర్యవసానంగా, రిజర్వ్ ప్లేయర్ కోటాలో కూడా మధ్యంతర ఎంపికకు నోచుకోలేదు. 
 
ఈ నేపథ్యంలో, తాను ఇక క్రికెట్ ఆడలేనంటూ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు అన్ని ఫార్మాట్లలో రిటైర్మెంటు ప్రకటించాడు. ఆఖరికి బీసీసీఐ ఆధ్వర్యంలోని ఐపీఎల్‌లో కూడా ఆడబోనని తేల్చిచెప్పాడు. కానీ, శ్రేయోభిలాషుల హితబోధతో రాయుడు మనసు మార్చుకున్నట్టు అర్థమవుతోంది. తన లేఖలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాడు. 
 
రిటైర్మెంటుపై పునరాలోచన విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ పెద్దలతో పాటు వీవీఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్ తనకు మార్గదర్శనం చేశారని రాయుడు వెల్లడించాడు. కష్టకాలంలో వారు అండగా నిలిచారంటూ కృతజ్ఞత వ్యక్తం చేశాడు. తనలో ఇంకా ఎంతో క్రికెట్ మిగిలుందన్న విషయాన్ని వారు గుర్తు చేశారని, రిటైర్మెంట్ నిర్ణయం తీవ్ర భావోద్వేగాల నడుము తీసుకున్నదని రాయుడు తన లేఖలో పేర్కొన్నారు. అయితే, రాయుడు లేఖపై బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సివుంది.