సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (11:23 IST)

ఆసియా కప్ 2023: లంకపై పది వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు

team india
శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్‌లో టీమిండియా మరో 263 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ 8వ సారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 పరుగులకే ఆలౌటైంది.
 
ఆదివారం జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలిచి 8వ సారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తద్వారా అత్యధిక ఆసియా టైటిళ్లు గెలుచుకున్న జట్టుగా రికార్డును సుస్థిరం చేసుకుంది. 
 
ఆసియా కప్ ట్రోఫీ అందుకున్న తర్వాత భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది, మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో భారత పేసర్ సిరాజ్ నాలుగో ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు. వన్డేల్లో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. మరో వికెట్ తీసిన తర్వాత, వన్డే మ్యాచ్‌లో అత్యంత వేగంగా (16 బంతుల్లో) ఐదు వికెట్లు తీసిన రికార్డు (చమిందా వాస్)ను సమం చేశాడు. సిరాజ్ విజృంభణతో ఒక దశలో శ్రీలంక 12 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.