1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (17:22 IST)

ఆసియా కప్ : 50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక..

siraj
ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా, ఆదివారం భారత్ - శ్రీలంక జట్ల మధ్య కీలక పోరు జరుగతుంది. ఈ పోటీలో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన  శ్రీలంక 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల దెబ్బకు శ్రీలంక బ్యాటర్లు వణికిపోయారు. ముఖ్యంగా, భారత పేసర్ మహమ్మద్‌ సిరాజ్‌ (6/13) ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోని విధంగా దెబ్బతీశాడు. ఇదేక్రమంలో వన్డేల్లో తన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. ఆసియా కప్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ కూడా ఇదే కావడం విశేషం. 
 
శ్రీలంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్‌ (17) టాప్‌ స్కోరర్‌ కావడం గమనార్హం. ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. కుశాల్ పెరీరా, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ, డాసున్ శనక, మతీష పతిర్నా పరుగులేమీ చేయలేదు. 
 
మిగిలినవారిలో పాథుమ్ నిశాంక (2), ధనంజయ డిసిల్వా (4), దునిత్ వెల్లలాగె (8) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివర్లో దుషాన్ హేమంత (13*) కాస్త పరుగులు చేయడంతో శ్రీలంక స్కోరు 50 పరుగులు దాటింది. సిరాజ్‌ 6 వికెట్లు.. హార్దిక్‌ పాండ్య మూడు, బుమ్రా ఒక వికెట్‌ తీశారు.
 
కాగా, ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా టాస్ ఓడితే ఓడింది కానీ... మహ్మద్ సిరాజ్ సంచలన స్పెల్ తో శ్రీలంక టాపార్డర్ వణికిపోయింది. కొలంబోలో జరిగిన ఫైనల్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే సిరాజ్ రూపంలో ఆ జట్టుకు అగ్నిపరీక్ష ఎదురైంది. 
 
నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విజృంభించిన సిరాజ్ ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసి లంకను చావు దెబ్బ కొట్టాడు. 4 ఓవర్లు ముగిసేసరికి లంక స్కోరు 5 వికెట్లకు 12 పరుగులు అంటే, ఆతిథ్య జట్టు ఎంతటి దయనీయ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని, నేటి మ్యాచ్‌కు ముందు విశ్లేషణలు వచ్చాయి. కానీ, టీమిండియా పేసర్లు పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. తొలి ఓవర్లోనే బుమ్రా చక్కని అవుట్ స్వింగర్‌తో లంక ఓపెనర్ కుశాల్ పెరీరాను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత సిరాజ్ మ్యాజిక్ మొదలైంది.
 
తన స్వింగ్ బౌలింగ్‌తో లంక బ్యాటర్లకు మిస్టరీగా మారాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో తొలి బంతికి ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక (2)ను అవుట్ చేసిన సిరాజ్ ఆ తర్వాత మూడో బంతికి సమరవిక్రమను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 
 
ఇక నాలుగో బంతికి సమరవిక్రమను తిప్పిపంపిన సిరాజ్... ఆరో బంతికి ధనంజయ వికెట్ కూడా తీయడంతో లంక పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాతి ఓవర్లోనూ సిరాజ్ జోరు కొనసాగింది. లంక సారథి దసున్ షనక కూడా సిరాజ్ అవుట్ స్వింగర్ కు బోల్తాపడ్డాడు. షనక కూడా డకౌటే. మ్యాచ్ ముగిసే సరికి  సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.