ఆసియా క్రికెట్ కప్ : ఎనిమిదో సారి విజేతగా భారత్
శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా, ఆదివారం ఫైనల్ పోటీ జరిగింది. ఇందులో శ్రీలంక భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టును భారత్ చిత్తుగా ఓడించి ఎనిమిదో సారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ (6/21) శ్రీలంక బ్యాటింగ్ వెన్ను విరగొట్టిన వేళ 50 పరుగులకే లంకేయులు కుప్పకూలారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ 23(18), ఇషాన్ కిషన్ 27 (19) వికెట్ కోల్పోకుండా భారత్‌ను విజయ తీరాలకు చేర్చారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల దెబ్బకు 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. టీమ్‌ఇండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ (6/21) ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. ఇదేక్రమంలో వన్డేల్లో తన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. ఆసియా కప్‌లో అతడికిదే బెస్ట్ బౌలింగ్ కావడం విశేషం.
శ్రీలంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (17) టాప్ స్కోరర్ కావడం గమనార్హం. ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. కుశాల్ పెరీరా, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ, డాసున్ శనక, పతిరన పరుగులేమీ చేయలేదు. మిగిలినవారిలో పాథుమ్ నిశాంక (2), ధనంజయ డిసిల్వా (4), దునిత్ వెల్లలాగె (8) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మ్యాచ్ ఆఖరులో దుషాన్ హేమంత (13*) కాస్త పరుగులు చేయడంతో శ్రీలంక స్కోరు ఆమాత్రమైనా చేయగలిగింది.
దీంతో భారత్ ఎదుట 51 పరుగుల స్వల్ప విజయలక్ష్యం ఉంచింది. భారత బౌలర్లలో సిరాజ్ ఆరు వికెట్లు తీయగా, పాండ్యా మూడు, బుమ్రా ఒక వికెట్ చొప్పున తీశాడు. ఈ స్కోరును భారత బ్యాటర్లు ఓపెనర్లే ఛేదించారు. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 23 పరుగులు చేయగా, శుభమన్ గిల్ 19 బంతుల్లో 29 పరుగులు చేసి జట్టును గెలిపించారు.
కాగా, ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. భారత్ తరపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్ సిరాజ్ తన పేరును లిఖించుకున్నాడు. అతడి కంటే ముందు స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12), బుమ్రా (6/19) ఉన్నారు.
వన్డే ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత తక్కువ స్కోరు (50) నమోదు చేసిన జట్టుగా శ్రీలంక చెత్త రికార్డును సాధించింది. గతంలో షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనే భారత్ 54 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇప్పుడా రికార్డును శ్రీలంకనే తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.
వన్డేల్లో శ్రీలంకకు ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇప్పుడు భారత్‌పై 50 పరుగులకు ఆలౌటైన లంక.. 2012లో దక్షిణాఫ్రికాపై 43 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత్ (2023) మీద త్రివేండ్రం వేదికగా 73 పరుగులే చేసింది.
వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన సిరాజ్.. ఆసియా కప్‌లోనూ రెండో బెస్ట్ ప్రదర్శన కావడం విశేషం. శ్రీలంక మాజీ బౌలర్ అజంత మెండిస్ (6/13) తర్వాత సిరాజ్ 6/21 స్పెల్‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లను భారత పేసర్లే తీయడం విశేషం.