శనివారం, 1 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (22:42 IST)

ఫలితం తేలకుండానే ముగిసిన ఆఫ్గాన్ మ్యాచ్ : సెమీస్‌కు ఆస్ట్రేలియా

gadaffi stadium
చాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా, శుక్రవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆప్ఘాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగానే ఫలితం తేలకుండానే ముగిసింది. దీంతో ఇరు జట్లకూ చెరో పాయింట్‌ను కేటాయించారు. ఇపుడు ఆస్ట్రేలియా ఖాతాలో మొత్తం నాలుగు పాయింట్లు చేరడంతో గ్రూపు-బి నుంచి సెమీస్‌లో చోటుదక్కించుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. ఆప్ఘాన్ బ్యాటర్లలో సెదికుల్లా అటల్ 85 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 67, ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 22 చొప్పున పరుగులు చేశాడు. మిగిలి ఆటగాళ్లలో రహ్మానుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా, రహ్మత్ షా 12, కెప్టెన్ హష్మతుల్లా షాహిది 20, మహ్మద్ నబీ 1, రషీద్ ఖాన్ 19 చొప్పున పరుగులు చేశారు. 
 
ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షూయిస్ 3, స్పిన్నర్ జాన్సన్ 2, ఆడమ్ జంపా 2, నేథన్ ఎల్లిస్ 1, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒకటి చొప్పున వికెట్లు తీశారు. 
 
ఆ తర్వాత 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు... 12.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసి పటిష్టస్థితిలో ఉన్న వేళ వరుణుడు అడ్డు తగిలాడు. అప్పటికీ క్రీజులో ట్రావిడ్ హెడ్ 59, కెప్టెన్ స్టీమ్ స్మిత 19 పరుగులతో అడుగుతున్నాడు. 
 
ఆ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ మళ్లీ ప్రారంభంకాలేదు. వర్షం ఎంతకీ తగ్గకపోగా, డీఎల్ఎస్ వర్తింపజేసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో మ్యాచ్ రద్దు చేశారు. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా, ఆప్ఘాన్ జట్ల చెరే పాయింట్ కేటాయించారు. మొత్తం 4 మొత్తంలో ఆసీస్ సెమీస్‌‍లో అడుగుపెట్టింది. 
 
మరోవైపు, ఆప్ఘాన్‌కు కూడా సెమీస్ అవకాశాలు మిణుమిణుకుమంటున్నాయి. శనివారం సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 207 పరుగుల భారీ తేడాతో గెలిస్తే సౌతాఫ్రికా రన్ రేట్ ఆప్ఘన్ రన్ రేట్ కంటే దిగువకు పడిపోతుంది. అపుడు గ్రూపు బి నుంచి రెండో జట్టుగా ఆప్ఘాన్ జట్టు సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఈ గ్రూపు నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే నిష్క్రమించిన విషయం తెల్సిందే.