సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (11:21 IST)

కంగారులకు ఏమైంది : వరుస ఓటములు ఎందుకని?

south africa team
భారత్‌లో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీ జరుగుతుంది. ఆతిథ్య భారత్ వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలుపొందింది. వీటిలో ఒకటి పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుపై గెలిచింది. అయితే, ఆస్ట్రేలియా మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. తొలుత భారత్ చేతిలో ఖంగుతిన్న కంగారులు.. ఆ తర్వాత గురువారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయారు. దీంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎందుకు కంగారు పడుతున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 
 
తొలుత భారత్‌పై గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. గురువారం నాటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. లక్నోలో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 134 పరుగుల భారీ తేడాతో కంగారూలను చిత్తు చేసింది. తొలుత దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. సఫారీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ క్వింటన్ డికాక్ (109) సెంచరీ సాధించాడు. లక్ష్యఛేదనలో ఆసీస్ 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది.
 
70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను మార్నస్ లబుషేన్ నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలించలేదు. లబుషేన్ చేసిన 46 పరుగులే కంగారూ ఇన్నింగ్స్‌లో అత్యధికం. లోయరార్డర్‌లో మిచెల్ స్టార్క్ 27, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 22 పరుగులు చేసినా, అవి ఏమాత్రం సరిపోలేదు. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (7), డేవిడ్ వార్నర్ (13) విఫలం కావడం ఆసీస్ అవకాశాలను దెబ్బతీసింది. ఆదుకుంటాడనుకున్న స్టీవ్ స్మిత్ సైతం 19 పరుగులకే వెనుదిరగడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. 
 
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జోష్ ఇంగ్లిస్ (5), ఆల్ రౌండర్లు గ్లెన్ మ్యాక్స్ వెల్ (3), మార్కస్ స్టోయినిస్ (5) చెత్తగా ఆడి అవుటయ్యారు. రబాడా, ఎంగిడి, యాన్సెన్ లతో కూడిన సఫారీ పేస్ త్రయం, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షంసీలతో కూడిన స్పిన్ ద్వయం ఆస్ట్రేలియా జట్టును ఎక్కడూ కుదురుకోనివ్వలేదు. క్రమంగా తప్పకుండా వికెట్లు తీస్తూ ఆసీస్‌పై ఒత్తిడి పెంచారు. రబాడా 3, యాన్సెన్ 2, కేశవ్ మహరాజ్ 2, షంసీ 2, ఎంగిడి 1 వికెట్ తీశారు.
 
మరోవైపు, ఈ ప్రపంచ కప్‌‌లో సౌతాఫ్రికాకు ఇది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్‌లో సఫారీలు శ్రీలంకను ఓడించారు. అందులోనూ 102 పరుగుల భారీ తేడాతో గెలవడం విశేషం. గురువారం ఆసీస్‌పై అంతకుమించిన తేడాతో గెలవడంతో సఫారీల నెట్ రన్ రేట్ అమాంతం 2.360కు చేరింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానానికి ఎగబాకింది.