శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:59 IST)

బోర్డుకు తలవంపులు తెచ్చే పనులు చేస్తారా.. కోహ్లీ - శాస్త్రిలపై ఫైర్

బోర్డుకు తలవంపులు తెచ్చే పనులు చేసిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రిలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, టీమ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ‌ర్ గిరీష్ డోంగ్రె పాత్ర‌ను కూడా బోర్డు ప‌రిశీలిస్తోంది అని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. 
 
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు సభ్యుల్లో కోచ్ రవిశాస్త్రితో పాటు.. మరో ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ వ్యవహారంపై కోచ్ ర‌విశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీల‌పై బీసీసీఐ గుర్రుగా ఉంది. పైగా, ఈ ఇద్ద‌రి నుంచి బోర్డు వివ‌ర‌ణ కోరిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే కోచ్ ర‌విశాస్త్రితోపాటు బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్‌, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధ‌ర్‌ల‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విష‌యం తెలిసిందే. అయితే వీళ్లంతా లండ‌న్‌లో గ‌త వారం జ‌రిగిన ఓ బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాతే క‌రోనా బారిన ప‌డిన‌ట్లు తేలింది. 
 
ఈ ముగ్గురూ కొవిడ్ బారిన ప‌డినా.. కెప్టెన్ కోహ్లితోపాటు ఇత‌ర ప్లేయ‌ర్స్‌కు మాత్రం నెగిటివ్ వ‌చ్చింది. అయితే ఈ బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్ల‌డానికి టీమ్ స‌భ్యులు.. బీసీసీఐ అనుమ‌తి కోర‌లేద‌ని తెలిసింది. దీంతో ఈ అంశాన్ని చాలా తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న బోర్డు.. విచార‌ణ జ‌ర‌ప‌నుంది. ఇదే విషయంపై వివరణ కోరుతూ బీసీసీఐ నోటీసులు జారీచేసినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ఇది బోర్డుకు త‌ల‌వంపులు తీసుకొచ్చింది. నాలుగో టెస్ట్ ముగియ‌గానే కోహ్లి, శాస్త్రిల‌ను బోర్డు వివ‌ర‌ణ కోరుతుంది. వీళ్లు ఈ ఈవెంట్‌కు వెళ్ల‌డంలో టీమ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ‌ర్ గిరీష్ డోంగ్రె పాత్ర‌ను కూడా బోర్డు ప‌రిశీలిస్తోంది అని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. ఆటగాళ్లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఇలాంటి ఈవెంట్‌ల‌కు వెళ్లొద్దంటూ బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ఒక్కో ప్లేయ‌ర్‌కు ప్ర‌త్యేకంగా నోటీసులు పంపినా.. ప్లేయ‌ర్స్ ఇలా నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించడాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది.