శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (08:59 IST)

సెలక్షన్ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ - కొత్త వారి కోసం దరఖాస్తుల ఆహ్వానం

bcci
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ సెలక్షన్ కమిటీని పూర్తిగా రద్దు చేసింది. ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరిగింది. ఇందులో భారత జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవనాన్ని ఎదుర్కొని ఇంటికి చేరుకుంది ఈ ఓటమి బోర్డు పెద్దలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సెలక్షన్ కమిటీని పూర్తిగా రద్దు చేసింది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతో సహా ఆయన సారథ్యంలోని కమిటీ మొత్తంపైనా వేటువేసింది. 
 
పైగా, కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెలెక్టర్లు కావాలంటూ బీసీసీఐ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అందుకోసం కొన్ని అర్హతలు కూడా నిర్ధేశించింది. 
 
సెలెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేనీసం ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడినవారు అర్హులని పేర్కొంది. అలాగే, ఆట నుంచి ఐదేళ్ల క్రితం రిటైరై ఉండాలని తెలిపింది. ఈ దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు సమర్పించాల్సి ఉంటుందని బీసీసీఐ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.