మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

రిటైర్మెంట్‌పై ప్రకటన చేయడానికి సరైన సమయం ఇదే.. కానీ..: ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

msdhoni
క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలిగేందుకు సరైన సమయం ఇదే కానీ... అంటూ తన రిటైర్మెంట్‌పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సస్పెన్స్ నెలకొనేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ 16 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని సీఎస్కే జట్టు కప్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యాత హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నకు ధోనీ చాలా తెలివిగా సమాధానమిచ్చాడు. 
 
'నా రిటైర్‌మెంట్‌పై సమాధానం కోసం మీరు చూస్తున్నారా? దానిపై ప్రకటన చేయడానికి ఇది సరైన సమయమే. కానీ, ఈ ఏడాది నేను ఎక్కడకు వెళ్లినా ప్రేక్షకుల నుంచి భారీగా ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నా. ఇలాంటప్పుడు అందరికీ థాంక్స్‌ అని చెప్పడం చాలా సులువు. అయితే, నాకు కష్టమైన విషయం ఏంటంటే.. మరో 9 నెలలు శ్రమించి కనీసం వచ్చే సీజన్‌ అయినా ఆడాలి. ఇదంతా నా శరీరంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఆరేడు నెలల సమయం ఉంది. టైటిల్‌ను మా జట్టు నాకు గిఫ్ట్‌ ఇచ్చింది. నాపట్ల వారు చూపిన ప్రేమాభిమానాలకు.. నేను చేయాల్సిన బాధ్యతలు ఇంకా ఉన్నాయనిపిస్తోంది. 
 
నా కెరీర్‌కు చివరి దశ కావడంతో కాస్త భావోద్వేగానికి గురయ్యా. తొలి మ్యాచ్‌ కోసం బరిలోకి దిగినప్పుడు అభిమానులు నా పేరును పలుకుతుంటే ఎమోషనల్‌గా మారా. డగౌట్‌లో ఉన్న నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే అనుకున్నా ఈ సీజన్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఆడాలని. అలాగే చెన్నై జట్టు పరిస్థితి కూడా ఇదే. తిరిగి వచ్చి మళ్లీ ఆడేందుకు చేయగలిగినదంతా చేస్తా. నన్ను, నా గేమ్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులకు రుణపడి ఉంటా. ఇదేసమయంలో నా వ్యక్తిత్వం ఎప్పటికీ మార్చుకోను. ప్రతి ట్రోఫీ ప్రత్యేకమే. అయితే, ప్రతి మ్యాచ్‌లోనూ ఉత్కంఠ ఉండటమే ఐపీఎల్‌ స్పెషల్. దాని కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి' అని అన్నారు.