చక్ దే ఇండియా : ఆస్ట్రేలియా గడ్డపై మెరిసిన భారత మొనగాళ్లు
ఛటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, కుల్దీప్ సింగ్. భారత క్రికెట్ జట్టుకు దొరికిన అరుదైన ఆణిముత్యాలు. భారత క్రికెట్‌లో 'ది వాల్'గా పేరొందిన రాహుల్ ద్రావిడ్‌కు ఏమాత్రం తీసిపోని క్రికెటర్ పుజారా. అందుకే రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియాకు లభించిన మరో 'వాల్' అంటూ ప్రశంసలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ కుర్ర క్రికెటర్ ఆస్ట్రేలియా గడ్డపై మొనగాడు అనిపించుకున్నాడు. సిడ్నీ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఏడు పరుగుల తేడాతో రెండో డబుల్ సెంచరీ చేజార్చుకున్నప్పటికీ ఓవరాల్‌గా సత్తా చాటాడు.
నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల కోసం ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ సిరీస్‌లో ఛటేశ్వర్ పూజారా ఏకంగా 524 (సగటు 74 శాతం) పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు కూడా దాగివున్నాయి. అలాగే, యువ సంచలనం, భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈ సిరీస్‌లో పెను సంచలనంగా మారాడు. తన కీపింగ్‌తో 20 ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఔట్ చేశాడు. అంతేనా సిడ్నీ టెస్టులో మెరుపు సెంచరీతో పాటు.. ఈ సిరీస్‌లో ఏకంగా 353 పరుగులు (58.33 సగటు) చేసి ఔవరాల్‌గా రెండో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా గుర్తింపుపొందాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక సెంచరీతో 282 పరుగులు చేశాడు.
అలాగే, భారత బౌలర్లలో బుమ్రా 21 వికెట్లు పడగొట్టి శభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో షమీ 16 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ 11 వికెట్లు తీశాడు. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే తమ మణికట్టు మాయాజాలంతో భారత విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ముగ్గురు స్పిన్నర్లు కలిసి 18 వికెట్లు పడగొట్టారు. వీరిలో జడేజా ఏడు వికెట్లు, అశ్విన్ ఆరు, కుల్దీప్ సింగ్ ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి కంగారుల వెన్నువిరిచారు.
ఇకపోతే, ఆస్ట్రేలియా గడ్డపై భారత్ 72 యేళ్ళ తర్వాత టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటివరకు మొత్తం 47 టెస్టులు ఆడిన భారత్ కేవలం ఏడు మ్యాచ్‌లలో విజయం సాధించింది. అదేవిధంగా 1980-81, 1985-86, 2003-04లలో జరిగిన టెస్ట్ సిరీస్‌లను భారత్ డ్రా చేసుకుంది. కానీ, ఇపుడు మాత్రం ఏకంగా 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుని విజయంసాధించింది.