గురువారం, 23 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2025 (14:52 IST)

ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న సైనికాధికారులకు 'వీర చక్ర'

operation sidoor
ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైనికాధికారులకు వీర చక్ర పురస్కారలతో కేంద్రం సత్కరించనుంది. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, వైమానికి దళాలకు చెందిన పలువురు అధికారులను ఈ ప్రతిష్టాత్మక వీర చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. 
 
వివిధ ఆపరేషన్లలో భాగంగా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన 1988 (ఇండిపెండెంట్) మీడియం బ్యాటరీకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిస్త్‌కు వీర చక్ర లభించింది. అలాగే, అత్యంత రహస్యంగా, తక్కువ సమయంలోనే ప్రత్యేక పరికరాలను విమానాల ద్వారా సమర్థంగా తరలించి, సైనిక సామర్థ్యాన్ని చాటిన 302 మీడియం రెజిమెంట్‌కు చెందిన కల్నల్ కోశాంక్ లాంబాను కూడా ఈ పురస్కారం వరించింది.
 
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నుంచి పలువురు అధికారులు వీర చక్రకు ఎంపికయ్యారు. శత్రువులు కట్టుదిట్టమైన గగనతలంలోకి చొచ్చుకెళ్లి, నిర్దేశిత లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించినందుకు ఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ రంజీత్ సింగ్ సిద్ధూకు ఈ గౌరవం దక్కింది. ఫార్వర్డ్ ఎయిర్ బేస్‌లో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (ఎస్ఏఎం) స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించి, మన వనరులకు ఎలాంటి నష్టం జరగకుండా శత్రువులకు భారీ నష్టం కలిగించిన గ్రూప్ కెప్టెన్ అనిమేశ్ పట్నీ కూడా వీర చక్ర అందుకున్నారు. 
 
మొత్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 127 గ్యాలంట్రీ అవార్డులు, 40 విశిష్ట సేవా పురస్కారాలకు ఆమోదం తెలిపారు. వీటిలో 4 కీర్తి చక్రలు, 15 వీర చక్రలు, 16 శౌర్య చక్రలు ఉన్నాయి. దేశ భద్రత పట్ల సైనిక దళాల అంకితభావం, నాయకత్వ పటిమ, కార్యాచరణ నైపుణ్యాలకు ఈ పురస్కారాలు నిదర్శనమని గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.