1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (10:16 IST)

ఆప్ఘనిస్తాన్ క్రికెటర్లకు క్రికెట్ లెజండ్ సచిన్ ముచ్చట్లు

sachin
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రచంప కప్ మెగా ఈవెంట్‌‍లో ఆప్ఘనిస్తాన్ జట్టు సంచలన విజయాలను నమోదు చేస్తూ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఈ టోర్నీలో ఆ జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తూ, ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలా ఆశ్చర్యం వ్యక్తం చేసిన వారి మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. తాజాగా ఆప్ఘాన్ క్రికెటర్లను మైదానంలో కలిశారు. 
 
ప్రస్తుతం ఆప్ఘాన్ క్రికెట్ జట్టంతా ముంబైలో ఉంది. మంగళవారం పెద్ద జట్టు ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ కోసం ఆప్ఘాన్ కుర్రోళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘాన్ శిబిరాన్ని సచిన్ సోమవారం సందర్శించాడు. ఆఫ్ఘాన్ ఆటగాళ్లతో కలిసి ఉత్సాహంగా ముచ్చటించాడు. వారిని పేరుపేరునా పలకరించి ఉత్తేజం నింపాడు. అంతేకాదు, ఆఫ్ఘనిస్థాన్ జట్టు కోచ్ జోనాథన్ ట్రాట్, సలహాదారు అజయ్ జడేజాలతోనూ సచిన్ ఉల్లాసంగా మాట్లాడుతూ కనిపించాడు.
sachin
 
ఇదిలావుంటే, వరల్డ్ కప్ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ 7 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలు సాధించింది. సెమీస్ అవకాశాలు ఊరిస్తుండటంతో ఆ జట్టు ఉత్సాహంగా ఉంది. అయితే, మంగళవారం ఆస్ట్రేలియాతో, ఈ నెల 10న దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉండడం ఆ జట్టుకు ప్రతికూలం కానుంది. ఎందుకంటే, కంగారులు, సపారీలను ఓడించాలంటే అంత సులభమైన విషయం కాదు. అయితే, ఆప్ఘాన్ కుర్రోళ్లు మాత్రం ఇప్పటివరకు మైదానంలో చూపిన తెగువ, ప్రదర్శనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.