ప్రపంచ కప్ 2023: భారత్ వర్సెస్ శ్రీలంక.. ఊరిస్తున్న రికార్డులు
ప్రపంచ కప్‌లో భాగంగా.. శ్రీలంకతో భారత్ పోరు నేడు జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే ఈ వరల్డ్ కప్‌లో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది.
ఇంకా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్తుంది. అంతేగాకుండా వరుసగా ఏడు వరల్డ్ కప్ మ్యాచ్‌లో గెలిచిన రికార్డును టీమిండియా సృష్టిస్తుంది. అంతేకాదు ఈ మ్యాచ్‌లో మరికొన్ని రికార్డులు కూడా ఊరిస్తున్నాయి. మరి ఆ రికార్డులు ఏంటో పరిశీలిద్దాం..
1. వన్డేల్లో 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేసే అవకాశాలున్నాయి. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 48 సెంచరీలు ఉన్నాయి.
2. ఒక క్యాలెండర్ ఏడాదిలో 1000 పరుగులు ఎక్కువసార్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం విరాట్, సచిన్ టెండూల్కర్ సమానంగా ఉన్నారు. సచిన్‌ను అధిగమించేందుకు కోహ్లీ కేవలం 34 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు.
3. శ్రేయాస్ అయ్యర్ తన తదుపరి మూడు మ్యాచ్‌ల్లో 65 పరుగులు చేస్తే ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన మూడవ వేగవంతమైన భారతీయ క్రికెటర్‌గా నిలుస్తాడు.
4. శ్రీలంక బౌలర్ మాథ్యూస్, రోహిత్ శర్మను వన్డేల్లో ఇప్పటివరకు ఏడుసార్లు అవుట్ చేశాడు. రోహిత్‌ను అందరి కంటే ఎక్కువసార్లు ఔట్ చేసింది ఈ బౌలరే కావడం విశేషం.