సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 14 జులై 2017 (06:21 IST)

రవిని అడిగే జహీర్, ద్రవిడ్‌లను ఎంపిక చేశాం.. ఇప్పుడిలా అంటే ఎలా.. సీఏసీ ప్రశ్న

టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్‌ కన్సల్టెంట్లుగా జహీర్, రాహుల్‌ ద్రవిడ్‌ నియామకం జరిగిపోయినా ఇంకా తన సొంత సహాయక సిబ్బంది కోసం కోచ్‌ రవిశాస్త్రి పట్టుబట్టడంపై క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు తమను బాధించాయని పరిపాలక కమి

టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్‌ కన్సల్టెంట్లుగా జహీర్, రాహుల్‌ ద్రవిడ్‌ నియామకం జరిగిపోయినా ఇంకా తన సొంత సహాయక సిబ్బంది కోసం కోచ్‌ రవిశాస్త్రి పట్టుబట్టడంపై క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు తమను బాధించాయని పరిపాలక కమిటీ (సీఓఏ)కి సీఏసీ లేఖ రాసింది. ‘జహీర్, ద్రవిడ్‌లను తీసుకోవడానికి ముందే శాస్త్రితో మాట్లాడాం. మా ఆలోచనను ఆయన అంగీకరించడంతో పాటు ఈ ఎంపిక జట్టుకు లాభిస్తుందని కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రవిశాస్త్రి అనుమతి తర్వాత జరిగిన ఎంపిక మాత్రమే’ అని ఆ లేఖలో సీఏసీ స్పష్టం చేసింది. మరోవైపు ద్రవిడ్, జహీర్‌ల‌ను పూర్తిస్థాయిలో కాకుండా ఒక్కో సిరీస్‌ని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసినట్లు బీసీసీఐ గురువారం వివరణ ఇచ్చింది.
 
బౌలింగ్‌ కోచ్‌ విషయంలో ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి అసంతృప్తితో ఉండగా, ఆయనకు మద్దతుగా అన్నట్టు పరిపాలక కమిటీ (సీఓఏ) కూడా ఈ విషయంలో అసంతృప్తిగా ఉంది. నిజానికి జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేయడంపై సీఓఏ హర్షం వ్యక్తం చేసినా.. బ్యాటింగ్, బౌలింగ్‌ కోచ్‌లుగా రాహుల్‌ ద్రవిడ్, జహీర్‌ ఖాన్‌లను తీసుకోవడంపై కమిటీ అంత సుముఖంగా లేదు. ఈ ఎంపికతో సీఏసీ తమ పరిధిని దాటి వ్యవహరించిందని పరిపాలక కమిటీ భావిస్తోంది. సీఏసీ విధి ప్రధాన కోచ్‌ను ఎంపిక చేయడం వరకే అని, సహాయక సిబ్బందిగా ఎవరుండాలనేది వారి పరిధి కాదని వ్యాఖ్యానించినట్టు మీడియా కథనం. 
 
సహాయక సిబ్బందిగా ఎవరుండాలనేది ప్రధాన కోచ్‌ విచక్షణకే వదిలేయాలని వారి అభిప్రా యం. దీంతో శనివారం ముంబైలో సమావేశం కానున్న సీఓఏ ఈ అంశంపై సమీక్ష చేయనుంది. ‘ద్రవిడ్‌ ఇప్పటికే అండర్‌–19, భారత్‌ ‘ఎ’ కోచ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ బాధ్యత ఆయనకు అదనపు భారం కానుంది. శనివా రం సహాయక సిబ్బంది విషయంలో సీఓఏ, బోర్డు ఓ నిర్ణయం తీసుకోనుంది. అంతిమంగా వీరి ఎంపికలో ప్రధాన కోచ్‌కే పూర్తి బాధ్యత ఉంటుంది’ అని సీఓఏ వర్గాలు పేర్కొన్నాయి.
 
ఈ పరిణామాల మధ్య ఈ వారాంతంలో పరిపాలక కమిటీ (సీఓఏ)ని శాస్త్రి కలిసే ఆలోచనలో ఉన్నారు. ‘జహీర్‌పై రవిశాస్త్రికి అత్యున్నత గౌరవం ఉంది. కానీ జట్టుకు ఫుల్‌టైమ్‌ బౌలింగ్‌ కోచ్‌ కావాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. బౌలర్ల కోసం రోడ్‌ మ్యాప్‌ను జహీర్‌ రూపొందిస్తే దాన్ని అరుణ్‌ అమలుపరుస్తాడు. శనివారం సీఓఏను కలిసి శ్రీలంక పర్యటనలోనే అరుణ్‌ను జట్టుతో పాటు పంపాలనే నిర్ణయం తీసుకోవాలని కోరనున్నారు’ అని బోర్డు సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. 
 
భారత క్రికెట్‌ జట్టు నూతన కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి ఇప్పుడు తనకు అనుకూలురైన సహాయక సిబ్బంది కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా జట్టు బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్‌ నియామకం శాస్త్రికి రుచించడం లేదు. ఆయన స్థానంలో ముందునుంచీ భరత్‌ అరుణ్‌ను ఈ పోస్టులోకి తేవాలని కోరుకున్నారు. అయితే గంగూలీ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) మాత్రం ఆయన ఇష్టాన్ని పక్కనపెట్టి జహీర్‌కు బౌలింగ్‌ బాధ్యతలు అప్పగించింది. 
 
అయితే జహీర్‌ పూర్తి స్థాయి బౌలింగ్‌ కోచ్‌గా ఏడాదిలో 250 రోజుల పాటు జట్టుకు సేవలందించలేడని, వంద రోజులకు మించి అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అందుకే అతడి వేతనం ఇంకా ఫైనల్‌ కాలేదు. దీంతో జహీర్‌ ఉన్నప్పటికీ అతడికి సహాయకంగానైనా భరత్‌ అరుణ్‌ కావాల్సిందేనని కొత్త కోచ్‌ పట్టుబడుతున్నారు.  అంతకుముందు జట్టు బౌలింగ్‌ కోచ్‌గా రవిశాస్త్రి అరుణ్‌ కోసం గట్టిగానే పట్టుబట్టారు. అరుణ్‌ తప్ప తనకు ఎవరూ వద్దని శాస్త్రి గట్టిగా వాదించారు.