1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (13:46 IST)

ప్రతిభకు చోటు లేదా? బీసీసీఐ సెలెక్టర్లకు వెంగ్ సర్కార్ ప్రశ్న

భారత క్రికెట్ జట్టు త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టు సభ్యుల ఎంపికపై పలువురు సీనియర్ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిలో దిలీప్ వెంగ్‌సర్కార ఒకరు. మంచి ఫామ్‌లో ఉన్న క్రికెటర్లను పక్కనబెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాంటి యువ క్రికెటర్లలో రుతురాజ్ గ్వైకాడ్ ఒకరు. 
 
దేశవాళీ క్రికెట్‌లో అమితంగా రాణిస్తున్నారు. విజయ్ హరారే ట్రోఫీలో మూడు సెంచరీలు బాదాడు. ఐపీఎల్ టోర్నీలోనూ అద్భుతంగా రాణించి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అలాంటి క్రికెటర్ బీసీసీఐ సెలెక్టర్ దృష్టిలో పడలేదు. దీనిపై వెంగ్ సర్కార్ స్పందించారు. 24 యేళ్ల మహారాష్ట్ర రంజీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారనీ, అతడు ఇంకెన్ని పరుగులు చేస్తే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ వరుసగా మూడు సెంచరీలు చేశాడని గుర్తుచేశాడు. 
 
రుతురాజ్ వయసు 18 లేక 19 యేళ్లు అయివుంటే అతడికి ఇంకా భవిష్యత్ ఉందని భావించవచ్చని, కానీ అతని వయసు ఇపుడు 24 యేళ్లు అని ఇంకెప్పుడు జట్టులోకి తీసుకుంటారని వెంగ్ సర్కార్ ప్రశ్నించారు. ఇపుడు తీసుకోక 28 యేళ్ల వయసొస్తే తీసుకుంటారా? అని నిలదీశారు.