గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జులై 2021 (17:54 IST)

వివాదంలో దినేశ్ కార్తీక్.. బ్యాట్లను పరాయి మగాళ్ల భార్యలతో పోల్చడమా?

టీమిండియా సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే కార్తీక్ కామెంటేటర్‌గా మారాడు. ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో తన కామెంట్రీతో ఆకట్టుకున్నాడు. 
 
అయితే ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య గురువారం జరిగిన రెండో వన్డే సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మహిళలు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలను ఎదుర్కొంటున్నాయి. 
 
చాలామంది బ్యాట్స్ మెన్ తమ బ్యాట్లను ఇష్టపడుతున్నట్టు కనిపించరని... ఇతర ఆటగాళ్ల బ్యాట్లను ఇష్టపడతారని కార్తీక్ అన్నాడు. బ్యాట్లు అనేని పరాయి పురుషుల భార్యల వంటివని... అవి ఎప్పుడూ ఆకర్షణీయంగానే ఉంటాయని వ్యాఖ్యానించాడు. దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
బ్యాట్లను పరాయి మగాళ్ల భార్యలతో పోల్చి చూడటాన్ని పలువురు నెటిజెన్లు తప్పుపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.