మంగళవారం, 28 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 అక్టోబరు 2025 (10:48 IST)

బ్రహ్మోస్ క్షిపణిని మించిన మిస్సైల్ - ధ్వని పేరుతో హైపర్ సోనిక్ గ్లైడ్ వెహిచక్

dhvani missile
భారత రక్షణ శాఖను మరింతగా బలోపేతం చేసేందుకు డీఆర్డీవో నడుం బిగించింది. ఇందులోభాగంగా, బ్రహ్మోస్ క్షిపణులను మించిన మిస్సైల్స్ తయారీ పనుల్లో నిమగ్నమైంది. ధ్వని అనే పేరుతో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఈ హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ పరీక్షలను ఈ యేడాది చివరి నాటికి పూర్తి చేసేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో దృష్టసారించింది. 
 
'ధ్వని' క్షిపణి ధ్వని వేగం కన్నా ఐదారు రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తుంది. దీని వేగం గంటకు సుమారు 7 వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ అసాధారణ వేగం 1500 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. ముఖ్యంగా, కొన్ని నిమిషాల వ్యవధిలోనే శత్రు స్థావరాలను ధ్వంసం చేసే సత్తా ఈ కొత్త అస్త్రానికి ఉంది.
 
ఈ క్షిపణి ప్రత్యేకత కేవలం దాని వేగమే కాదు, ప్రయాణ మార్గంలో దిశను మార్చుకోగల సామర్థ్యం కూడా వుంది. ఈ కారణంగా శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థలు దీనిని గుర్తించి, అడ్డుకోవడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. సాధారణ క్రూయిజ్ క్షిపణుల్లా కాకుండా, దీనిని ముందుగా ఒక రాకెట్ బూస్టర్ సాయంతో అత్యంత ఎత్తుకు పంపిస్తారు. అక్కడ బూస్టర్ నుంచి విడిపోయిన 'ధ్వని' గ్లైడ్ వెహికల్, సెమీ-బాలిస్టిక్ మార్గంలో హైపర్ సోనిక్ వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. ఇది రాడార్ల కంట పడకుండా ఉండేందుకు దోహదపడుతుంది.
 
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎయిర్ ఫ్రేమ్, ఏరోడైనమిక్స్, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే థర్మల్ మేనేజ్‌మెంట్, స్క్రామ్‌జెట్ ఇంజిన్ పనితీరు వంటి కీలకమైన ప్రాథమిక పరీక్షలను డీఆర్డీఓ ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, హైపర్ సోనిక్ టెక్నాలజీ కలిగిన అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాల సరసన భారత్ కూడా సగర్వంగా నిలుస్తుంది.