శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 అక్టోబరు 2023 (21:48 IST)

ప్రపంచ కప్ 2023 : ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. కొదమ సింహాల్లా సెమీస్‌లోకి ఎంట్రీ

shami
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం లక్నో వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భారత ఆటగాళ్లు ఇంగ్లండ్‌ను చిత్తు చేశారు. ఈ విజయంతో టీమిండియా కొదమ సింహాల్లా సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ 100 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో భారత్ తన నాకౌట్ బెర్తును కరారు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ ముంగిట 230 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత ఆటగాళ్ళలో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ మాత్రమే రాణించారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ కాగా, మిగిలిన ఆటగాళ్ళు రెండు అంకెల స్కోరు కూడా చేయలేక పోయారు. దీంతో భారత్ తక్కువ స్కోరుకే ఇన్నింగ్స్ ముగించింది. 
 
కెప్టెన్ రోహిత్ శర్మ 87, కేఎల్ రాహుల్ 39, సూర్య కుమార్‌లు 49 చొప్పున పరుగులు చేయగా, కోహ్లీ 0, గిల్ 9, శ్రేయాస్ అయ్యర్ 4, జడేజా 8 చొప్పున మాత్రమే పరుగులు చేశారు. గత మ్యాచ్‌లలో దారుణ ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, డేవిడ్ విల్లీ 3, క్రిస్ వోక్స్ 2, అదిల్ రషీద్ 2, మార్క్ ఉడ్ ఒక్కో వికెట్ చొప్పున తీసి భారత్ వెన్ను విరిచారు. 
 
లక్నో పిచ్‌పై బౌన్స్, కొద్దిగా స్వింగ్ లభించడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని అద్భుతంగా రాణించారు. బ్యాటర్లు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ పదునైన బంతులు విసరడంతో అది సాధ్యం కాలేదు. అదేసమయంలో ఇంగ్లండ్ ఫీల్డింగ్ కూడా మెరుగు పడటంతో భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. 
 
ఆ తర్వాత 230 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 34.5 ఓవర్లలో 129 పరుగులకే చేతులెత్తేసారు. ఆ జట్టు బ్యాటర్లలో ఏ ఒక్కరూ భారీ స్కోరు చేయలేకపోయారు. లివింగ్‌స్టోన్ 27 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జానీ బెయిర్ స్టో 14, డేవిడ్ మలన్ 16 చొప్పున పరుగులు చేయగా, జో రూట్, బెన్ స్టోక్‌లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. బట్లర్ 10, మెయిన్ అలీ 15, క్రిస్ వోక్స్ 10 పరుగులు చేశారు. 
 
భారత బౌలర్లలో మహ్మద్ షమి 22 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అలాగే, బుమ్రా 3 (32 రన్స్), కుల్దీప్ యాదవ్ 2 (24 రన్స్), జడేజా ఒక వికెట్ చొప్పున తీసి ఇంగ్లండ్ జట్టును శాసించారు. అలాగే, ఈ ఓటమితో ఇంగ్లండ్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. 2023 ప్రపంచ కప్ పోటీల నుంచి నిష్క్రమించనున్న తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఈ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదింటిలో ఓడిపోయింది. కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టకలో అట్టడుగు స్థానంలో నిలించింది.