శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2024 (10:35 IST)

హనుమ విహారికి ఏసీఏ షోకాజ్ నోటీసులు...

hanuma vihari
ఇటీవల ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ)పై సంచలన వ్యాఖ్యలు చేసిన టెస్ట్ క్రికెటర్ హనుమ విహారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. అపెక్సౌ కౌన్సిల్ సమావేశం తర్వాత ఆయనకు ఈ నెల 25వ తేదీన ఈ షోకాజ్ నోటీసులు పంపించినట్టు సమాచారం. 'విహారికి షోకాజ్ నోటీసులు పంపించాం. అతడి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం. గత నెలలో అతను ఎందుకు అలా స్పందించాడో తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఫిర్యాదుల గురించి చెప్పేందుకు అతనికి ఇదో అవకాశం. దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్ర జట్టు వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన విహారి విలువ మాకు తెలుసు' అని ఏసీఏ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
 
మరోవైపు, ఈ నోటీసుకు తాను బదులిచ్చానని విహారి పేర్కొన్నాడు. తన విషయంలో అన్యాయంగా వ్యవహరించారని, రాబోయే దేశవాళీ సీజన్‌లో ఇతర రాష్ట్ర జట్టుకు ఆడేందుకు ఎన్ఎసీ అడిగానని అతడు వెల్లడించారు. ఏసీఏ స్పందన కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. గత నెల 26న మధ్యప్రదేశ్ క్వార్టర్స్ పోటీల్లో ఆంధ్ర జట్టు ఓటమి అనంతరం.. రాజకీయ నాయకుల జోక్యం కారణంగా తనను జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించారని విహారి ఆరోపించిన విషయం తెలిసిందే. 
 
మరోసారి ఆంధ్రకు ఆడనంటూ ఇన్‌స్టా ఖాతాలో అతడు పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. జట్టులో 17వ ఆటగాడిపై అరవడంతో, రాజకీయ నాయకుడైన అతడి తండ్రి, ఏసీఏపై ఒత్తిడి తెచ్చి తనపై వేటు వేయించాడని విహారి ఆరోపించాడు. తనకు మద్దతుగా జట్టు, ఆటగాళ్లు సంతకాలు చేసిన లేఖనూ పోస్టు చేశాడు. అలాగే, ఈ అంశంపై సైతం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు.