ఇంటిని - ఇల్లాలిని వదిలేసి.. 24x7 ప్రజా సేవలో రియల్ హీరో!
అతనికి ఇల్లు, భార్యాపిల్ల కంటే ప్రజలే సంరక్షణే ముఖ్యం. అందుకే ఇంటిని, ఇల్లాలిని వదిలిపెట్టి... ప్రజల కోసం 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ రియల్ హీరో అని ప్రజలతో జేజేలు కొట్టించుకుంటున్నారు. ఆ రియల్ ఎవరో కాదు.. మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ. భారత ట్వంటీ20 ప్రపంచ కప్ హీరో.
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో.. ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్న జోగిందర్ శర్మపై ఇప్పటికే ఐసీసీ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాను వారంలో 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని.. ప్రజా సేవే తన ప్రథమ కర్తవ్యం అని జోగిందర్ తాజాగా వెల్లడించాడు.
ఇదే అంశంపై జోగిందర్ శర్మ ఓ ట్వీట్ చేశారు. "24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటా. ఉదయం నుంచి రాత్రి వరకు విధులు నిర్వర్తించి ఇంటికి చేరిన తర్వాత కూడా.. ఏదైన అత్యవసర పరిస్థితి నెలకొంటే వెంటనే అక్కడ వాలిపోతా. ప్రస్తుతం నేను విధులు నిర్వర్తిస్తున్న హిస్సార్ ప్రాంతంలో ప్రజలకు వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నా. విపత్కర పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నా" అని చెప్పుకొచ్చాడు.
కాగా, 2007 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసి, భారత క్రికెట్ జట్టును విజేతగా నిలిపాడు. దీంతో రాత్రికి రాత్రే జాతీయ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత తన క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలికిన తర్వాత అనంతరం హర్యానాలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు.