శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 నవంబరు 2019 (19:24 IST)

21 మందితో క్రికెట్ ఆడేవాడిని: షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

పాక్ క్రికెట్‌లో ఓ కుదుపు కుదిపిన మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంపై తాజాగా ఆ దేశ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పెదవి విప్పాడు.

2011లో పేసర్ మహ్మద్ ఆమిర్, మహ్మద్ అసిఫ్‌లు మ్యాచ్ ఫిక్సింగ్‌లో దొరికి ఐదేళ్లపాటు నిషేధానికి గురయ్యారు. స్పాట్ ఫిక్సింగ్‌లో దొరికిపోయిన ఓపెనర్ సల్మాన్ బట్ కూడా ఐదేళ్ల నిషేధానికి గురయ్యాడు.

ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఓ టీవీ టాక్ షోలో మాట్లాడుతూ మ్యాచ్ ఫిక్సింగ్‌పై స్పందించాడు. తాను ప్రత్యర్థులతోపాటు తన జట్టులోని ప్రత్యర్థులతో కూడా కలిసి ఆడానని గుర్తు చేసుకున్నాడు.
 
‘‘పాకిస్థాన్‌ను మోసం చేయకూడదని నేను నమ్మేవాడిని. నేనెప్పుడూ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదు. కానీ నా చుట్టూ మ్యాచ్ ఫిక్సర్లే ఉండేవారు. నేను 21 మంది ప్రత్యర్థులతో క్రికెట్ ఆడేవాడిని.

వారిలో 11 మంది విదేశీ క్రికెటర్లు, 10 మంది మా వాళ్లు. కానీ ఎవరికి తెలుసు? మ్యాచ్ ఫిక్సర్ ఎవరో. మొత్తం మ్యాచ్‌లన్నీ బుకీలు ఫిక్సింగ్‌ చేసినట్లు ఫిక్సింగ్‌కు పాల్పడిన మహ్మద్ అసిఫ్ నాతో చెప్పాడు’’ అని ‘రివైండ్ వింత్ సమీనా పీర్జాదా’ టాక్ షోలో అక్తర్ పేర్కొన్నాడు.
 
మ్యాచ్ ఫిక్సింగ్ విషయం తనను తీవ్రంగా బాధించిందని, చాలా కోపం వచ్చిందని అక్తర్ గుర్తు చేసుకున్నాడు. ‘‘ఆమిర్, అసిఫ్‌లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా. ఫిక్సింగ్ అభియోగాలు వినగానే వారి టాలెంట్ వృథా అయిపోయిందని బాధపడ్డా.

నిరుత్సాహంతో గోడకు పంచ్‌లు విసిరా. ఇద్దరు టాప్ బౌలర్ల టాలెంట్ వృథా అయిపోయిందని బాధపడ్డా. కేవలం కొద్దిపాటి డబ్బులకు వారు అమ్ముడుపోయారు’’ అని అక్తర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
 
నిషేధానికి గురైన ఆమిర్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో చోటు సంపాదించుకోగా, అసిఫ్, సల్మాన్ బట్‌లకు ఆ అవకాశం దక్కలేదు. 2019 క్రికెట్ ప్రపంచకప్‌లో పాక్ జట్టుకు ఆమిర్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే, ఆ తర్వాత జూలై 26న 27 ఏళ్ల వయసులోనే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశాడు.