శనివారం, 15 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (16:28 IST)

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ : విజేతకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

champion trophy
ఈ నెల 19వ తేదీ నుంచి పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో విజేతకు భారీ మొత్తంలో నగదు బహుమతి అందజేయనున్నారు. ఈ ప్రైజ్ మనీపై ఐసీసీ శుక్రవారం అధికారిక ప్రకటన వెలువరించింది. టోర్నీ ఫైనల్ విజేతగా నిలిచే జట్టుకు ఏకంగా రూ.20.80 కోట్ల మేరకు నగదు బహుమతిని అందజేయనున్నారు. అలాగే, రన్నరప్ జట్టుకు రూ.10.40 కోట్లు, సెమీస్ చేరిన జట్లకు రూ.5.20 కోట్లు ఇవ్వనున్నారు. 
 
ఇక నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన జట్టుకు తలా రూ.3 కోట్లు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో రూ.1.20 కోట్లు అందుకోనున్నాయి. ఇక చాంపియన్స్ ట్రోఫీలో ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ.29 లక్షల అదనంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే, 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో విజేత జట్టుకు రూ.14.18 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ.7 కోట్లు చొప్పున ప్రైజ్ మనీ ఇచ్చారు. 
 
కాగా, ఈ దఫా జరిగే టోర్నీలో భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడనున్న విషయం తెల్సిందే. ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత 23వ తేదీన దాయాది దేశం, చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య జట్టు పాకిస్థాన్‌తో తలపడుతుంది. మార్చి ఒకటో తేదీన న్యూజిలాండ్ జట్టుతో రోహిత్ సేన ఆడుతుంది.