ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (15:04 IST)

అదరగొట్టిన త్రిష - మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ టైటిల్ భారత్ వశం

trisha gongadi
మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచ టీ20 కప్ పోటీల్లో తెలుగమ్మాయి గొంగడి త్రిష అదరగొట్టింది. దీంతో భారత క్రికెట్ జట్టు విజయభేరీ మోగించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన టోర్నీ ఫైనల్లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 11.2 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.
 
ఈ మ్యాచ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. బౌలింగులో 3 వికెట్లు తీయడమేకాకుండా, ఓపెనర్‌గా బరిలో దిగి 33 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. త్రిష స్కోరులో 8 ఫోర్లు ఉండటం గమనార్హం. మరో ఓపెనర్ జి.కమలిని 8 పరుగులకే అవుటైనా... వన్‌డౌన్ బ్యాటర్ సనికా చల్కేతో కలిసి త్రిష భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. సనికా చల్కే 22 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసింది. సనికా చల్కే విన్నింగ్ షాట్‌గా ఫోర్ కొట్టి టీమిండియా శిబిరాన్ని సంబరాల్లో ముంచెత్తింది. సఫారీ బౌలర్లలో కెప్టెన్ కేలా రీనెకె 1 వికెట్ తీసింది.
 
అంతకుముందు... సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ మహిళా క్రికెటర్లు పరుగులు చేయలేక ఇబ్బందులు పడ్డారు. చివరకు దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌట్ అయింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసి ఆ సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. పరునిక సిసోడియా 2, ఆయుషి శుక్లా 2, వైష్ణవి శర్మ 2, షబ్నమ్ షకీల్ 1 వికెట్ తీశారు. 
 
అనంతరం, సులభసాధ్యమైన లక్ష్యఛేదనకు బరిలో దిగిన టీమిండియా 10 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. ఓపెనర్ త్రిష 40, వన్ డౌన్ బ్యాటర్ సనికా 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానికి మరో 12 పరుగులు కావాలి.
 
మరోవైపు, ఇప్పటివరకు ఈ టోర్నీ రెండుసార్లు నిర్వహించగా... రెండు పర్యాయాలు టీమిండియానే టైటిల్ సాధించింది. 2023లో జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో టీమిండియ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు వరుసగా రెండోసారి టోర్నీలో విజేతగా అవతరించింది.