గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 నవంబరు 2024 (14:48 IST)

బీసీసీఐ నిర్ణయంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీపై నీలి నీడలు...

champion trophy
పాకిస్థాన్ వేదికగా వచ్చే యేడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరగాల్సివుంది. అయితే, పాకిస్థాన్ గడ్డపై జరిగే మ్యాచ్‌లకు భారత క్రికెట్ జట్టు పాల్గొనదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తేల్చి చెప్పింది. పైగా, హైబ్రిడ్ విధానంలో భారత్ ఆడే మ్యాచ్‌లను షార్జా లేదా దుబాయ్‌లలో నిర్వహించేలా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీకి సంబంధించిన అన్ని మ్యాచ్‌లు తమ దేశంలోనే జరగాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పట్టుబడుతుంది. 
 
అయితే, ట్రోఫీ కోసం పాకిస్థాన్ వెళ్లేదిలేదని భారత్ ఇప్పటికే తేల్చిచెప్పింది. దీంతో భారత జట్టు ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ తొలుత భావించింది. దీనికి పాక్ బోర్డు అంగీకరించకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇప్పటికీ ఖరారు కాలేదు. ఈ సందిగ్ధం నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని రద్దు చేయాలని ఐసీసీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 
 
వచ్చే యేడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య ఈ టోర్నీ నిర్వహణకు ముసాయిదా షెడ్యూల్‌ను ఇప్పటికే ఐసీసీకి పీసీబీ అందజేసింది. దీనిప్రకారం చూస్తే.. ట్రోఫీ నిర్వహణకు ఎక్కువ సమయంలేదు. ఇప్పటికే వంద రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభం కావాల్సింది. 'ట్రోఫీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఆతిథ్య దేశం పాకిస్థాన్‌తోపాటు ఈ టోర్నీలో పాల్గొనే జట్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. షెడ్యూల్ విషయంలో ఎదురవుతున్న ఆటంకాలపై చర్చిస్తున్నాం. షెడ్యూలింగ్ కుదరకుంటే టోర్నీని రద్దు చేయడమా లేక వాయిదా వేయడమా అనేది నిర్ణయిస్తాం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువరిస్తాం' అని ఐసీసీ వర్గాలు తెలిపాయి.