ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2024 (13:43 IST)

అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగించే వ్యక్తి : తులసిరెడ్డి

tulasi reddy
అధికారం కోసం వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారంటూ కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఆరోపించారు. ఆస్తుల పంపిణీ అంశంలో జగన్, షర్మిల మధ్య తలెత్తిన వివాదం రాష్ట్రంలో పెను చర్చనీయాంశంగా మారిన విషయం తెల్సిందే. షర్మిలను లక్ష్యంగా చేసుకుని వైకాపా నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ అంశంపై కడప జిల్లా వేంపల్లెలో తులసి రెడ్డి మాట్లాడుతూ, జగన్‌కు డబ్బు పిచ్చి, అధికార పిచ్చి ఉన్నాయని, వాటి కోసం ఎంతకైనా దిగజారతాడని అన్నారు. వైఎస్ మరణం వెనుక రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుట్ర ఉందని అప్పట్లో వైఎస్ అభిమానులను జగన్ రెచ్చగొట్టడంతో వారు రిలయన్స్ ఆస్తులపై దాడులు చేసి విధ్వంసం సృష్టించారన్నారు. 
 
అధికారంలోకి వచ్చాక అదే అంబానీకి జగన్ ఘనస్వాగతం పలికి విందు భోజనం పెట్టాడని, ఆయన సిఫారసు చేసిన పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చాడని గుర్తుచేశారు. ఇపుడు ఆస్తి కోసం కన్నతల్లినే కోర్టుకీడ్చాడన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ షర్మిల చదువుతోందని వైసీపీ నేతలు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 
 
ఆ మాటకొస్తే బీజేపీ రాసిచ్చిన స్క్రిప్టులు చదివే అలవాటు వైసీపీకి ఉందని విమర్శించారు. బీజేపీ చేతిలో టీడీపీ, వైసీపీ, జనసేన కీలుబొమ్మలన్నారు. ఏపీలో బీ అంటే బాబు, జే అంటే జగన్, ఏ అంటే పవన్ అని అందరికి తెలుసని చెప్పారు. వైసీపీ నేతలు పసలేని మాటలు మాట్లాడొద్దని తులసి రెడ్డి హితవు పలికారు.