గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2024 (13:22 IST)

కన్నతల్లిని కోర్టుకులాగిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారంటే అది మా జగనన్నే : వైఎస్ షర్మిల

YS Sharmila
కన్నతల్లిని కూడా కోర్టుకు లాగిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారంటే అది మా జగనన్న మాత్రమేనని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల పంపకం ఇపుడు వీధికెక్కిన విషయం తెల్సిందే. తల్లికి, చెల్లికి రావాల్సిన ఆస్తులను ఎగ్గొట్టే కుట్రలో భాగంగా, తల్లి, చెల్లిపై జగన్మోహన్ రెడ్డి కోర్టుకెక్కారు. దీంతో వైఎస్ షర్మిల మీడియా ముందుకు వచ్చి, అసలు ఆస్తుల పంపకం విషయంలో తమ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను మీడియాకు వివరించారు. 
 
ముఖ్యంగా, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లో వాటా ఉందంటూ షర్మిల చెబుతున్నదే నిజమైతే ఆమెపై ఈపాటికే ఈడీ కేసులు నమోదు చేసి ఉండేది కదా అంటూ వైవీ సుబ్బారెడ్డి శనివారం మీడియాతో వ్యాఖ్యానించారు. దీనిపై షర్మిల ఘాటుగా స్పందించారు. పేర్లు పెట్టుకుంటే ఆస్తులు ఇవ్వాలని ఉందా? అని సుబ్బారెడ్డి అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తన కుమారుడికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి పేరు పెట్టారని గుర్తుచేశారు. 
 
ఇక, ఆస్తులు నావైతే నేను కూడా జైలుకు వెళ్లాలి అని సుబ్బారెడ్డి అన్నారు... మరి ఆస్తులు భారతికి చెందినవి అయితే ఆమె కూడా జైలుకు వెళ్లాలి కదా అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. సుబ్బారెడ్డి కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుండేది అని పేర్కొన్నారు. ఇలాంటి గొడవలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయని అంటున్నారు... కానీ కన్నతల్లిని కోర్టుకు లాగిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉంటారా? కన్నతల్లిని కోర్టుకు లాగడం ఘర్ ఘర్ కీ కహానీయా? అని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
'జగన్ ప్రయోజనాల కోసం నేను, అమ్మ చాలా కష్టపడ్డాం. జగన్ కోసం రెండు ఎన్నికల్లో పాదయాత్రలు చేశాను. ఓసారి ఏకంగా 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. నేను చేసిన తప్పేంటో చెప్పాలని వైసీపీ శ్రేణులను అడుగుతున్నా. జగన్ కోసం నేను ఎంతో కష్టపడ్డాను. నా కోసం జగన్ ఏం చేశారు? ఆస్తులకు సంబంధించిన ఎంవోయూ పత్రాలు ఐదేళ్ల పాటు నా వద్దే ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఎంవోయూ నేను వాడుకోలేదన్నారు. 
 
వైఎస్ కుటుంబం గురించి చెడుగా చెప్పుకుంటారనే నేను మాట్లాడలేదు. విజయమ్మను కోర్టుకు లాగారంటే దానికి కారణం ఎవరు? సొంత కొడుకే తల్లిని కోర్టుకు లాగడం దారుణం కాదా? ఇలాంటివి చూసేందుకే ఇంకా బతికున్నానని అమ్మ బాధపడుతోంది. లాభం కలుగుతుందని భావిస్తే జగన్ ఎవరినైనా 
 
వాడుకుంటారు. లాభం ఉండదని తెలిస్తే జగన్ ఎవరినైనా అణచివేస్తారు. ఇలాంటి వ్యక్తి మీకు నాయకుడో, లేక ఉన్మాదో వైసీపీ శ్రేణులు ఆలోచించాలి" అని షర్మిల పేర్కొన్నారు.