ఐసీసీ టీ20 వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్ : గయానాలో వాతావరణం ఎలా ఉంది?
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా, రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. వెస్టిండీస్ దేశంలోని గయానా ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్టు స్థానిక వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
కాగా, ఈ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ గురువారం ఉదయం ఆప్ఘనిస్థాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగింది. ఇందులో సఫారీలు విజయం సాధించి తొలిసారి ఐసీసీ మెగా ఈవెంట్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం అందరూ ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గురువారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
అయితే, ఈ కీలక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని తెలియడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. కానీ, ఇపుడు అభిమానులకు ఊరటనిచ్చే వార్తను గయానా వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటివరకు అక్కడ వాతావరణం పొడిగానే ఉన్నట్లు అక్కడి వాతావరణ నివేదికలు వెల్లడించాయి. కానీ, మ్యాచ్ మొదలయ్యే సమయానికి చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. అది కూడా కొద్దిసేపు మాత్రమే ఉంటుందట. ఆ తర్వాత మళ్లీ పొడి వాతావరణం ఉంటుందని చెప్పుకొచ్చింది.
ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే మాత్రం భారత్ నేరుగా ఫైనల్లోకి అడుగు పెడుతుంది. ఎందుకంటే సూపర్-8లో టీమిండియా గ్రూప్-1లో టాప్‌లో నిలిచింది. ఐసీసీ నిబంధనల మేరకు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే ఇలా గ్రూప్ అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉంది.