11 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్ గెలవని టీమిండియా.. కోహ్లీ అదుర్స్!
టీ20 ప్రపంచకప్ 2024 తుది దశకు చేరింది. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది. టైటిలే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగాయి. ప్రపంచకప్ చరిత్రలోనే సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్ చేరింది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి తమ జట్టుకు తొలి ఐసీసీ టైటిల్ అందించాలని భావిస్తోంది.
మరోవైపు టీమిండియా గత 11 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదు. టైటిల్ గెలిచి 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఉవ్విళ్లూరుతోంది. టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిన జట్టుకు ఐసీసీ రూ. 20.42 కోట్లు(2.45 మిలియన్ డాలర్లు) ప్రైజ్‌మనీగా ఇవ్వనుంది. రన్నరప్ జట్టుకు రూ. 10.67 కోట్లు క్యాష్ రివార్డ్‌గా దక్కనుంది.
ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్‌లో ఈ వరల్డ్ కప్ ఆరంభం నుంచి వరుసగా విఫలమవుతూ వస్తున్న విరాట్ కోహ్లీ... ఇవాళ దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. కోహ్లీ అండతో అక్షర్ పటేల్ చెలరేగాడు. అక్షర్ 31 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
విరాట్ కోహ్లీ 59 బంతుల్లో ఆరు సిక్సర్లు, రెండు ఫోర్లతో 76 పరుగులు సాధించాడు. శివబ్ దూబే 16 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 27 పరుగులు సాధించాడు.
అంతకుముందు ఓపెనర్లుగా దిగిన భారత్ ఆటగాళ్లలో రోహిత్ శర్మ 9 పరుగులకే వెనుదిరిగాడు. రిషబ్ పంత్ పరుగులేమీతో పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి భారత్ 7 వికెట్ల నష్టంతో 176 పరుగులు సాధించింది.