భారత మహిళా క్రికెట్ ప్లేయర్‌ను కలిసిన బుకీలు.. భారీగా ఆఫర్ చేశారట..
భారత మహిళా క్రికెట్ ప్లేయర్‌ను ఇద్దరు బుకీలు కలిశారనే ఆరోపణలపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంగ్లండ్‌తో ఆడే మ్యాచ్ ఫిక్స్ చేయాలని వారు ఆమెను సంప్రదించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ఆడేందుకు ముందు ఫిబ్రవరిలో ఈ సంప్రదింపులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
తమను తాము స్పోర్ట్స్ మేనేజర్లుగా పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఒక భారత మహిళా క్రికెటర్‌ను సంప్రదించారు. తనకు-రాకేష్ బాఫ్నాకు మధ్య ఫోన్లో జరిగిన సంభాషణను ఆమె రికార్డ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మోసం, జూదం సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో చిక్కుకున్ననిందితుల పేర్లు జితేంద్ర, బాఫ్నా అని పోలీసులు వెల్లడించారు.
ఈ బెట్టింగ్ రూ.300 కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు జరిగిందని అంచనా. ఇద్దరు బుకీలు మ్యాచ్ ఫిక్స్ చేయమని తనతో మాట్లాడారని మహిళా క్రికెటర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహిళా క్రికెటర్లు కూడా పురుష క్రికెటర్ల లాగే బుకీల దృష్టిలో పడుతున్నారు. అందుకే వాళ్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బీసీసీఐ అధికారి అజిత్ సింగ్ షెకావత్ మీడియాతో అన్నారు.