గురువారం, 2 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మార్చి 2023 (15:47 IST)

అహ్మదాబాద్ టెస్ట్ : సెంచరీ కొట్టిన కోహ్లీ... ఆసీస్ స్కోరును దాటేసిన భారత్

kohli - axar
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌‍లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సుధీర్ఘకాలం తర్వాత బ్యాట్‌తో రాణించి సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్న కోహ్లీ 241 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ చివరగా గత 2019లో ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన టెస్టులో సెంచరీ చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కోహ్లీ ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 
 
ఇదిలావుంటే, మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 289/3తో బరిలోకి భారత్ ఆరంభంలోనే రవీంద్ర జడేజా (28) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ (44)తో కలిసి ఐదో వికెట్‌‍కు 86 పరుగులు చేశాడు. రెండు భారీ సిక్సర్లతో అర్థ సెంచరీకి చేరువైన భరత్‌ను బౌలర్ లయన్ వెనక్కి పంపాడు. కోహ్లీ మాత్రం లయన్ బౌలింగులోనే సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 
 
ఇది కోహ్లీకి 28వ వ్యక్తిగత సెంచరీ. ప్రస్తుతం కోహ్లీ (160), అక్షర్ పటేల్ (49)తో కలిసి క్రీజ్‌లో దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమలో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌‍లో చేసిన 480 పరుగులను భారత్ దాటేసింది. ప్రస్తుతం భారత జట్టు 5 వికెట్లకు 508 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ 2, టాడ్ మర్ఫీ 2, మాథ్యూ కుహ్నెమన్‌ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.