మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 15 జనవరి 2019 (16:51 IST)

అడిలైడ్‌లో కోహ్లీ వన్‌మ్యాన్ షో : 39వ సెంచరీ... భారత్ విజయభేరీ

అడిలైడ్‌లో విరాట్ కోహ్లీ వన్‌మ్యాన్ షో ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. ఫలితంగా తన కెరీర్‌లో 39వ సెంచరీని బాదేశాడు. అలాగే, ఆస్ట్రేలియాపై ఆరో సెంచరీ, ఛేజింగ్‌లో 24వ సెంచరీతో దమ్మురేపాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. దీంతో భారత్ ముంగిట 299 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
లక్ష్య ఛేదనలో భాగంగా, భారత్ జట్టు తన తొలి వికెట్‌ను ధవాన్ (32) రూపంలో కోల్పోయింది. ఆ తర్వాత రోహిత్ శర్మ (43), అంబటి రాయుడు(24) పరుగులు చేసి జట్టు స్కోరును 150 పరుగులు దాటించారు. ఈ క్రమంలో 101 పరుగుల వద్ద రోహిత్, 160 పరుగుల వద్ద రాయుడు ఔటయ్యారు. 
 
వీరిద్దరితో కలిసి కెప్టెన్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 112 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 2 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 104 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే, మాజీ కెప్టెన్ ధోనీ మాత్రం తన మార్క్ బ్యాటింగ్‌తో జట్టును విజయతీరానికి చేర్చాడు. 54 బంతులు ఆడిన ధోనీ 2 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేయగా, దినేష్ కార్తీక్ 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 25 రన్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 
 
అంతకుముందు ఆస్ట్రేలియా 298/9 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా, ఆ జట్టు ఆటగాడు షాన్ మార్ష్ సెంచరీతో రెచ్చిపోయాడు. 123 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. దీంతో భారత్ ముంగిట 299 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. ఒక్క భువనేశ్వర్ (4/45), షమీ (3/58) మినహా మిగిలిన బౌలర్లు చేతులెత్తేశారు. ప్రధానంగా వన్డేల్లో అరంగేట్రం చేసిన హైదరాబాదీ పేసర్ సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. సిరాజ్ తన పది ఓవర్ల కోటాను పూర్తి చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయకుండా 76 పరుగులు సమర్పించుకున్నాడు. 
 
మరోవైపు, భారత బౌలర్లు పోరాడినప్పటికీ పిచ్ బ్యాటింగ్‌కు సహకరించడంతో వీలుచిక్కినప్పుడల్లా కంగారూలు అలవోకగా రాబట్టారు. ముఖ్యంగా ఆసీస్ ఇన్నింగ్స్‌లో మార్ష్ బ్యాటింగ్ హైలెట్‌గా నిలిచింది. ఓవర్ వ్యవధిలోనే ఓపెనర్లు వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడిన ఆసీస్‌కు మార్ష్ వెన్నెముకలా నిలిచాడు. పీటర్ హాండ్స్‌కాంబ్(20), మార్కస్ స్టాయినీస్(29)లతో కలిసి రన్‌రేట్ పడిపోకుండా బ్యాటింగ్ కొనసాగించారు. 
 
62 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసిన షాన్ మార్ష్.. 108 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు. వన్డే కెరీర్‌లో అతనికిది ఏడో సెంచరీ. ఇక శతకం పూర్తైన తర్వాత వేగం పెంచి మాక్స్‌వెల్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖర్లో మాక్స్‌వెల్ ఫోర్లతో చెలరేగడంతో ఆసీస్ 298 పరుగులు చేసింది. ఈ రన్స్‌ను భారత జట్టు మరో నాలుగు బంతులు మిగిలివుండగానే ఛేదించింది.