శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 జనవరి 2021 (14:53 IST)

బ్రిస్బేన్ టెస్టుకు హనుమ విహారి దూరం!

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్‌లో జరుగనుంది. ఈ టెస్టు మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కండర గాయంతో హనుమ విహారి చివరి టెస్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి విహారి కోలుకొనేందుకు సుదీర్ఘ సమయమే పట్టనుందని తెలుస్తోంది. 
 
'విహారి గాయం తీవ్రత స్కానింగ్‌ నివేదిక వచ్చాకే తెలుస్తుంది. అది గ్రేడ్‌-1 గాయమైనా అతడు కోలుకొనేందుకు కనీసం 4 వారాలు పడుతుంది. అందువల్ల ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌కే కాదు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌కూ విహారి దూరమయ్యే చాన్సుంది' అని బోర్డు అధికారి వెల్లడించారు. 
 
బ్రిస్బేన్‌ టెస్ట్‌కు విహారి స్థానంలో ఎవరిని తుదిజట్టులోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. గాయపడిన జడేజా స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌కు చివరి టెస్ట్‌లో చోటు లభించే చాన్స్‌ ఉంది.  
 
కాగా, ఇప్పటికే బొటనచేతి వేలిగాయంతో రవీంద్ర జడేజా మ్యాచ్‌కు దూరమయ్యాడు. సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రా కావడంలో కీలక పాత్ర పోషించిన హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్‌లూ దాదాపు దూరమైనట్టేనంటున్నారు. 
 
తాజాగా ఇండియా పేస్ దళాన్ని భుజాన మోస్తున్న జస్ప్రీత్ బుమ్రా కూడా బ్రిస్బేన్‌లో జనవరి 15 నుంచి జరగాల్సి ఉన్న నాలుగో టెస్టుకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. పొత్తికడుపు కండర గాయంతో బాధపడుతున్న బుమ్రాను మ్యాచ్ ఆడించి రిస్క్ తీసుకోవద్దన్న ఆలోచనలో టీమిండియా యాజమాన్యం ఉంది. 
 
మూడో టెస్టు సందర్భంగా అతడు పొత్తికడుపు సమస్యకు సంబంధించి బాగా ఇబ్బంది పడినట్టు కనిపించాడు. కాసేపు మైదానాన్నీ వీడాడు. ఫిజియోతో చికిత్స తీసుకున్నాక మళ్లీ ఆడాడు. మొత్తంగా మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 87 ఓవర్లు బౌల్ చేసింది. అందులో గాయంతోనే 25 ఓవర్లు ఒక్క బుమ్రానే వేశాడు.
 
ఈ నేపథ్యంలోనే అతడి విషయంలో రిస్క్ తీసుకోకూడదని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఒకవేళ అతడు చివరి టెస్ట్ మ్యాచ్‌కు మిస్ అయితే.. అనుభవం లేని బౌలింగ్ దళంతో భారత్‌కు ఇబ్బందులు తప్పేలా కనిపించట్లేదు. బుమ్రా స్థానంలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ అయినా ఆడని నటరాజన్, శార్దూల్ ఠాకూర్‌లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇక, అశ్విన్ కూడా దూరమైతే అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కే వీలుంది.