సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (18:16 IST)

ఇండోర్‌లో మయాంక్ మాయాజాలం : డబుల్ సెంచరీ... భారత్ భారీ స్కోరు

ఇండోర్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. జట్టులోని ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోమారు బ్యాట్‌తో రాణించాడు. తన టెస్ట్ కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ బాదాడు. మొత్తం 330 బంతుల్లో 28 ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 243 పరుగులు చేశాడు. 
 
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 86/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 105 పరుగుల వద్ద చతేశ్వర్ పుజారా (54) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 86 పరుగులు చేసిన అంజిక్య రహానే సెంచరీ ముంగిట బోల్తాపడ్డాడు. భారత్ కోల్పోయిన నాలుగు వికెట్లూ అబు జాయెద్‌కే దక్కడం గమనార్హం. 
 
అంతకుముందు బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది. ఇందులో మయాంక్ అగర్వాల్ 243 పరుగులు చేయగా, పుజారా 54, రహానే 86, జడేజా 60 (నాటౌట్), షా 12, యాదవ్ 25 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అబు జాయేద్‌కు 4 వికెట్లు, హోస్సైన్, హాసన్ మీరాజ్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్రస్తుతం టీమిండియా 343 పరుగుల ఆధిక్యంతో ఉంది.