సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (17:12 IST)

సచిన్ రికార్డును బ్రేక్ చేయనున్న మిథాలీ రాజ్.. మరో మూడు నెలలే..?

Mithali Raj
0టీమిండియా మహిళల క్రికెట్‌ జట్టు సారథి మిథాలీ రాజ్‌.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ రికార్డును బ్రేక్ చేయనుంది. సచిన్‌ తర్వాత సుదీర్ఘ కాలం ఆడిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆమె 22 వసంతాలు పూర్తి చేసుకుంది. 1999, జూన్‌ 26న మిథాలీ రాజ్‌ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచుతో 22 ఏళ్లు పూర్తి చేసుకుంది.
 
అతి త్వరలో సచిన్‌ రికార్డునూ తిరగ రాయనుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం క్రికెట్‌ ఆడిన ఘనత ఇప్పటి వరకు సచిన్‌ పేరుతో ఉంది. ఆయన ఏకంగా 22 ఏళ్ల 91 రోజులు ఆటలో కొనసాగారు. అంటే మరో మూడు నెలలు ఆడితే మిథాలీ ఆయన రికార్డును అధిగమిస్తుంది.
 
ప్రస్తుతం మిథాలీ రాజ్‌ సుదీర్ఘ ఫార్మాట్‌, వన్డే క్రికెట్‌ మాత్రమే ఆడుతోంది. టీ20లకు గుడ్‌బై చెప్పేసింది. వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌ గెలిచి వీడ్కోలు పలకాలని ఆమె భావిస్తోంది. ఆమె సారథ్యంలో టీమ్‌ఇండియా ఇప్పటి వరకు రెండుసార్లు ఫైనల్‌కు చేరుకుంది. చివరి ప్రపంచకప్‌లో మిథాలీ సేన గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపుగా కప్‌ను ఒడిసిపట్టినంత పనిచేసింది. కానీ త్రుటిలో ఓటమి పాలైంది.
 
ఇప్పటి వరకు మహిళల క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్‌ కూడా మిథాలీయే. 214 మ్యాచులాడి 7000+ పరుగులు చేసింది. ఇక ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలోనూ ఆమె కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. 27/2తో కష్టాల్లో పడ్డ జట్టును ఆదుకొంది. పూనమ్‌ రౌత్‌ (32)తో కలిసి 56, దీప్తి శర్మ (30)తో కలిసి 65 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పింది. 95 బంతుల్లో అర్ధశతకం సాధించింది. 72 పరుగులు చేసిన మిథాలీ.. సోఫీ ఎకిల్‌స్టోన్‌ వేసిన 46వ ఓవర్లో ఔటైంది.