శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. మహామహులు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (13:48 IST)

Happy birthday-Sachin Tendulkar... సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఇదే రోజు..?

Sachin
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు నేడు. ఏప్రిల్ 24వ తేదీతో సచిన్ 48వ వసంతంలోకి అడుగుపెట్టాడు. తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఈ మాస్టర్ బ్లాస్టర్ ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మరెన్నో అద్భుతమైన విజయాలందించాడు. కానీ.. సరిగ్గా తన పుట్టిన రోజే ఈ భారతరత్నం చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు.

తన విధ్వంసకర సెంచరీతో ఆస్ట్రేలియాను గడగడలాడించాడు. ముఖ్యంగా ఆ దేశ స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్‌కు చుక్కలు చూపించి ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. ఆ సూపర్ ఇన్నింగ్స్‌ను అభిమానులు సచిన్ బర్త్‌డే సందర్భంగా నెమరువేసుకుంటున్నారు. మాస్టర్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.
 
సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఏప్రిల్ 24, 1998)న దుబాయ్ వేదికగా జరిగిన కొకకోలా షార్జ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ట్రై సిరీస్ ఫైనల్లో సచిన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 131 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 134 పరుగులతో వీరవిహారం చేసిన మాస్టర్.. ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించాడు.
Sachin Tendulkar


అతని పోరాటం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు సచిన్ ఆ సిరీస్‌లో మొత్తం 434 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. అప్పట్లో తన సూపర్ బ్యాటింగ్‌ను కొనియాడుతూ క్రికెట్ విశ్లేషకులు ‘ఏడారిలో సచిన్ తుఫాన్'అంటూ అభివర్ణించారు.
 
సచిన్ పేరిట పలు రికార్డులు వున్నాయి. వన్డే క్రికెట్‌లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా, అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 
 
అలాగే సంప్రదాయ టెస్టు ఫార్మెట్‌లోనూ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. పిన్న వయస్సులో టెస్ట్ క్రికెట్ ఆడిన భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ రికార్డ్ సచిన్ పేరిట వుంది. 
Sachin Tendulkar
 
1994లో అర్జున అవార్డు, 1999లో పద్మశ్రీ పురస్కారం, 1997లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారం, 1997లో విస్డెన్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ పురస్కారం, 2008లో పద్మ విభూషణ్ పురస్కారం, 2010లో ఐసిసి క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నారు మాస్టర్ బ్లాస్టర్.