వైజాగ్ టెస్ట్ : 203 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
విశాఖపట్టణం కేంద్రంగా సౌతాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా 203 పరుగుల తేడాతో కోహ్లీ సేన గెలుపొందింది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌కు లభించిన ఇది మూడో విజయం.
పైగా, కోహ్లీ సేన తన సొంత గడ్డపై యేడాదికి పైగా విరామం తర్వాత ఆడి విజయం సాధించింది. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా 203 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో షమీ(5/35), జడేజా(4/87) అద్వితీయ ప్రదర్శనతో సఫారీలను కుప్పకూల్చారు.
ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ క్రికెట్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 502 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 323 పరుగుల వద్ద డిక్లేర్ చేశారు. అలాగే, సౌతాఫ్రికా కూడా తన తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆ తర్వాత 395 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. చివరి రోజు ఆటలో టీమిండియాకు తొమ్మిది వికెట్లు కావాల్సి ఉండగా.. రెచ్చిపోయిన బౌలర్లు సఫారీ జట్టును చుట్టేశారు. ఆదివారం ఉదయం సెషన్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అద్భుత బౌలింగ్‌తో సౌతాఫ్రికా టాపార్డర్ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరింది.
అయితే, లంచ్ విరామానికి ముందు.. తర్వాత సెనురన్ ముత్తస్వామి(49 నాటౌట్), పైట్(56) చాలాసేపు పోరాడటంతో భారత్ గెలుపు ఆలస్యమైంది. లంచ్ బ్రేక్ తర్వాత చాలాసేపు వికెట్ ఇవ్వకుండా ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆతిథ్య జట్టును ఇబ్బంది పెట్టింది. ఎట్టకేలకు షమీ.. పైట్‌ను బౌల్డ్ చేయడంతో కోహ్లీసేన గెలుపు లాంఛనమైంది. తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన డీన్ ఎల్గర్(2) డుప్లెసిస్(13), డికాక్(0) విఫలమయ్యారు.
ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేయగా, మరో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. అలాగే, సౌతాఫ్రికాలో డీఎల్గర్, డికాక్‌లు సెంచరీ చేశారు.