బాధపడకండి- మీరు ఓడితే మద్దతిస్తాం.. గెలిచినా నవ్వుతాం.. దక్షిణాఫ్రికాకు ఓదార్పు (video)
భారత మహిళల జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. కానీ దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ పోరాట పటిమకు క్రికెట్ ప్రపంచం హ్యాట్సాఫ్ చెబుతోంది. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ నిర్దేశించిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.
కానీ ఓ వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ లారా వోల్వార్డ్ మాత్రం క్రీజులో పాతుకుపోయి ఒంటరి పోరాటం చేసింది. లారా వోల్వార్డ్ కేవలం 98 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అద్భుతమైన సెంచరీ(101) పరుగులు పూర్తి చేసుకుంది. ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో ఇంత గొప్పగా పోరాడడం ఆమె అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ ఫైనల్‌లో సెంచరీ సాధించడం ద్వారా, లారా వోల్వార్డ్ ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. టోర్నీ ఆద్యంతం స్థిరంగా నిలిచింది. దీంతో సఫారీ జట్టును ఫైనల్ వరకు చేర్చడంలో కీలకపాత్ర పోషించింది. అయితే లారా వోల్వార్డ్ పట్టిన అమన్‌జోత్ కౌర్ క్యాచ్‌ను 1983 వరల్డ్ కప్ ఫైనల్‌లో కపిల్ దేవ్ పట్టిన వివ్ రిచర్డ్స్ క్యాచ్‌తో పోలుస్తున్నారు.
మ్యాచ్ ముగిసిన అనంతరం ఫైనల్లో ఓడినా తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ పేర్కొంది. బ్యాటింగ్ వైఫల్యం వల్లే తాము ఓడిపోయామని అంగీకరించింది. ఈ ఓటమిని ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతామని తెలిపింది.
వరల్డ్ కప్ రన్నర్స్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా తీవ్ర నిరాశకు గురైంది. అయితే క్రీడా స్ఫూర్తితో టీమిండియా మహిళలు వారిని ఓదార్చారు. వారిని ఆలింగనం చేసుకుని ఒకరికొకరు ఆప్యాయతగా పలకరించుకున్నారు.
దక్షిణాఫ్రికా క్రికెటర్లు కూడా టీమిండియా స్టార్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్స్ ఇచ్చి.. తమ అభినందనలు తెలిపారు. దక్షిణఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్‌కు, ఇతర సభ్యులకు ఓదార్పుతో స్వదేశానికి వెళ్లి రమ్మని సాగనంపారు. క్రీడల్లో గెలుపోటముల్లో ఇవన్నీ సహజమని తెలియజేశారు. ఓడిపోయినా మద్దతుగా వుంటామని, మీరు గెలిచినా మేము నవ్వుతూ పలకరిస్తామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.