శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (05:49 IST)

ప్రత్యర్థుల గౌరవం పొందుతున్న అరుదైన జట్టు కోహ్లీ టీమ్

భారత క్రికెట్ జట్టుకు ఇది స్వర్ణయుగం అనే చెప్పాలి. ఒక కీలక వికెట్ పడగొడితే చాలు భారత్ జట్టు పని అయిపోయినట్లే అనే అపప్రథ నుంచి బయటపడి ప్రపంచ స్థాయి జట్లను సవాలు చేసే స్తాయికి ఎదిగి, ప్రస్తుతం ప్రపంచ జట్లు ఆరాధనతో చూస్తున్న స్థాయికి ఎదిగిన భారత క్రికెట

భారత క్రికెట్ జట్టుకు ఇది స్వర్ణయుగం అనే చెప్పాలి. ఒక కీలక వికెట్ పడగొడితే చాలు భారత్ జట్టు పని అయిపోయినట్లే అనే అపప్రథ నుంచి బయటపడి ప్రపంచ స్థాయి జట్లను సవాలు చేసే స్తాయికి ఎదిగి, ప్రస్తుతం ప్రపంచ జట్లు ఆరాధనతో చూస్తున్న స్థాయికి ఎదిగిన భారత క్రికెట్ జట్టుకు ఇది ఆయాచితంగా లభించిన వరం మాత్రం కాదు. సంవత్సరాలుగా జట్టును కఠోరసాధనతో మలిచిన వైనం, ఆటగాళ్ల వ్యక్తిగత క్రమశిక్షణ, రాజీపడకుండా సాధించిన ఫిట్ నెస్ ఇవే ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత్‌ను అద్వితీయ స్థానంలో నిలుపుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నీ కలిసి జపిస్తున్న ఒకే ఒక పేరు కోహ్లీ. తన ఆటతో క్రికెట్ స్థాయిని పెంచిన విరాణ్మూర్తి కోహ్లీ అన్ని దేశాల క్రికెట్ అభిమానులకే కాదు. క్రికెట్ ఆటగాళ్లకు కూడా ఆరాధనామూర్తి అయిపోయాడు. తాజాగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఈ కోవలో నడిచారు. 
 
హైదరాబాద్ భారత్‌పై టెస్ట్ మ్యాచ్‌లో ఓడిన అనంతరం బంగ్లాదేశ్ యువ క్రికెటర్లు కోహ్లీని కలిసేందుకు ఆసక్తిని కనబర్చారు. కోచ్‌తో సహా వారు కోహ్లీ వద్దకు వచ్చి ఫొటోలు దిగారు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. టీ షట్స్‌పై సంతకాలు చేయించుకున్నారు. కొంత సమయం పాటు కోహ్లీతో ముచ్చటించారు. ఇలా పర్యటన ముగిసిన తర్వాత ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు కోహ్లీని కలవడం గతంలో కూడా చాలా సార్లు జరిగింది. ఇంగ్లడ్‌తో సిరీస్ అనంతరం ఆ దేశ ఆటగాళ్లు కూడా కోహ్లీని కలిసి మాట్లాడారు. పలు సూచనలు పొందారు. 
 
19 వరుస టెస్ట్ విజయాలు, బ్యాటింగ్‌లో విజృంభణ, పలు రికార్డ్‌లు బ్రేక్ చేయడంతో కోహ్లీ అందరికీ స్ఫూర్తిదాయకంగా మారిపోయాడు. దీంతో విరాట్‌ను పొగడటం, అతనితో మాట్లాడాలని అనుకోవడం కామన్‌గా మారిపోయింది. అయితే భారత పర్యటనకు వస్తున్న జట్లు ఇలా మ్యాచ్‌లు ముగిసిన అనంతరం కోహ్లీని కలస్తుండటం కోహ్లీ గొప్పదనాన్ని మరింత పెంచుతుంది. ఇది కోహ్లీకే కాదు భారత జట్టు గౌరవానికి కూడా మరింత తోడ్పాటును అందిస్తుంది. 
 
అశ్విన్‌ను ప్రత్యేకంగా కలిసిన బంగ్లాదేశ్ ఆటగాడు..
భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇది బంగ్లాదేశ్ జట్టుకు భారత్‌పై తొలి టెస్ట్ మ్యాచ్. అయితే మ్యాచ్ అనంతరం బంగ్లా ఆటగాళ్లు భారత ఆటగాళ్లను కలవడానికి ఎక్కువ ఆసక్తి కనబర్చారు. యువ క్రికెటర్లు కోహ్లీ వద్దకు వెళ్లి ఫొటోలు దిగి, ఆటో గ్రాఫ్‌లు తీసుకున్నారు. అయితే భారత్‌తో జరిగిన టెస్టులో ఆల్‌రౌండర్‌గా రాణించిన బంగ్లాదేశ్ యువ ఆల్‌‌రౌండర్ మెహదీ హాసన్ ప్రత్యేకంగా రవిచంద్రన్ అశ్విన్‌ను కలిశాడు. స్పిన్ బౌలింగ్‌లో పలు మెళుకవలు, సూచనలు అడగి తెలుసుకున్నాడు. చాలాసేపు అశ్విన్‌తో ముచ్చటించాడు. ఆల్‌ రౌండర్‌గా ఎదుగుతున్న మెహదీ హాసన్ అంతర్జాతీయ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్‌లో టాప్‌లో ఉన్న అశ్విన్‌ను కలవడానికి ఆసక్తి కనబర్చాడు.