శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (08:01 IST)

ఐపీఎల్ విజేతగా ధోనీ సేన.. ఫైనల్‌లో చతికిలపడిన కోల్‌కతా

ఐపీఎల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ మరోమారు అవతరించింది. శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనల్‌లో ధోనీ సేన విజయం సాధించింది. ఫలితంగా ఐపీఎల్ ట్రోఫీనీ నాలుగోసారి మరోమారు తన ఖాతాలో వేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ 32, ఉతప్ప 31, మొయీన్ అలీ 37(నాటౌట్) పరుగులు చేయగా, డుప్లెసిస్ చెలరేగిపోయాడు. 59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ 2, శివమ్ మావీ ఒక వికెట్ తీసుకున్నారు.
 
ఆ తర్వాత 193 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కేకేఆర్ 165 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆ జట్టు ఓపెనర్లు శుభమన్ గిల్ (51), వెంకటేశ్ అయ్యర్ (50) అర్థ శతకాలతో విరుచుకుపడినప్పటికీ తర్వాతి వరుసగా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో కేకేఆర్‌కు పరాజయం తప్పలేదు. 
 
తొలి వికెట్‌కు గిల్, అయ్యర్ జోడి 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి అద్బుతమైన శుభారంభాన్ని ఇచ్చింది. అయితే, దానిని నిలుపుకోవడంలో తర్వాతి బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. చెన్నై బౌలర్ల దెబ్బకు కేకేఆర్ బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. నితీశ్ రాణా, షకీబల్ హసన్ గోల్డన్ డక్ అయ్యారు. 
 
సునీల్ నరైన్ (2), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (4), దినేశ్ కార్తీక్ (9), రాహుల్ త్రిపాఠి (2) అందరూ తీవ్రంగా నిరాశపరిచారు. చివరల్లో లాకీ ఫెర్గ్యూసన్ (18, నాటౌట్), శివం మావి (20) కాస్త ఫరవాలేదనిపించినప్పటికీ అప్పటికే పుణ్యకాలం కాస్తా ముగిసిపోయింది. 26 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 
 
చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీసుకోగా, హేజిల్‌వుడ్, రవీంద్ర జడేజా చెరో రెండు, దీపక్ చాహర్, బ్రావో చెరో వికెట్ పడగొట్టారు. సీఎస్కే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డుప్లెసిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించగా, హర్షల్ పటేల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.