సెంచూరియన్ టెస్టులో విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్
ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో సెంచూరియన్ పార్క్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయానికి ఆరు వికెట్ల దూరంలో ఉంది. మరో రోజు ఆట మిగిలివుంది. వరుణుడు కరుణిస్తే ఈ మ్యాచ్‌లో స్పష్టమైన ఫలితం రానుంది.
భారత్ నిర్ధేశించిన 305 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పేసర్లు సఫారీలను దెబ్బతీశారు. ఫలితంగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సఫారీలు ఓడిపోకుండా ఉండాలంటే ఐదో రోజంతా క్రీజ్‌లో ఉండాలి. భారత్ గెలవాలంటే మాత్రం సాయంత్రంలోపు ఆరు వికెట్లు పడగొట్టాల్సివుంది.
ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు కెప్టెన్ డీన్ ఎల్గార్ 52 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. నాలుగో రోజు ఆట మురికొద్దిసేపట్లో ముగుస్తుందనగా పేసర్ బూమ్రా అద్భుతమైన బంతితో నైట్ వాచ్‌మెన్ కేశవ్ మహరాజ్‌ను బోల్తా కొట్టించి బౌల్డ్ చేశాడు. అంతకుముందు సఫారీ జట్టు ఓపెనర్ ఐడెన్ మార్ క్రమ్ కేవలం ఒక్క పరుగు చేసి షమీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
అలాగే, కీగన్ పీటర్సన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్‌లు కూడా తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఫలితంగా ఆతిథ్య జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. భారత బౌలర్లలో రెండు, సిరాజ్, షమీలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
కాగా, భారత్ తన తొలిన్నింగ్స్‌లో 327 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 174 రన్స్ చేశారు. అలాగే, ఆతిథ్య సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లను కోల్పోయిన 94 పరుగులు చేసింది. విజయానికి మరో 211 పరుగులు చేయాల్సివుంది. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి.