శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (19:36 IST)

రసవత్తరంగా సెంచూరియన్ టెస్ట్ : భారత్ 174 ఆలౌట్ - సఫారీల టార్గెట్ 305 రన్స్

సెంచూరియన్ పార్క్ మైదానంలో భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 174 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 130 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని మొత్తం 305 పరుగులను టార్గెట్‌ను సౌతాఫ్రికా ముంగిట ఉంచింది. అయితే, పిచ్ పేసర్లకు విశేషంగా సహకరిస్తుండటంతో లక్ష్య ఛేదన ఏమంత సులభంగా కనిపించడం లేదు. భారత పేసర్లు సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో చావుదెబ్బ తీసిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసింద. ఇందులో అత్యధికంగా కీపర్ రిషబ్ పంత్ (34), రహానే (20)లు చేసిన పరుగులే అత్యధికం కావడం గమనార్హం. సఫారీ బౌలర్లలో రబాడా, జాన్సెన్ నిప్పులు చెరిగే బంతులు విసిరి తలా నాలుగేసి వికెట్లు తీసి భారత్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు. ముఖ్యంగా కెరీర్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మార్కో జాన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత ఆటగాళ్లను ముప్పు తిప్పలుపెట్టాడు. మరో పేసర్ ఎంగిడి 2 వికెట్లు తీశాడు. 
 
తొలి ఇన్నింగ్స్‌లో 197కే ఆలౌట్ అయిన సఫారీలు 
తొలి టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన సౌతాఫ్రికా జట్టు కేవలం 197 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
దీంతో భారత్‌కు 130 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది. ఈ ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఐదు వికెట్లతో రాణించి సౌతాఫ్రికా ఆటగాళ్ల వెన్ను విరిచాడు. తద్వార 200 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. అలాగే, బుమ్రా, శార్దూల్ ఠాకూర్‌కు రెండేసి వికెట్లు, సిరాజ్‌కు ఒక వికెట్ లభించింది. సౌతాఫ్రికా ఆటగాళ్లలో టెంబా బవుమా 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే, డికాక్ 34, రబాడా 25, జాన్సెన్ 19 చొప్పున పరుగులు చేశాడు. 
 
ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్ చేపట్టి తొలి వికెట్‌ను కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 140 పరుగుల ఆధిక్యంతో కలుపుకుంటే మొత్తం 143 పరుగుల లీడ్‌లో ఉంది.