200 వికెట్ల క్లబ్‌లో మహ్మద్ షమీ - థర్డ్ ఇండియన్‌గా రికార్డు
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. సౌతాఫ్రికాతో సెంచూరియన్ పార్క్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి రాణించాడు. తద్వారా రూ.200 వికెట్ల క్లబ్‌లో చేరాడు. మొత్తం 55 టెస్ట్ మ్యాచ్‌లలో 200 వికెట్లు తీసిన ఆటగాడిగా తన పేరును నమోదు చేసుకున్నాడు.
ఈ సందర్భంగా షమీ తన తండ్రిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. తన కోసం తండ్రి ఆయన జీవితాన్ని త్యాగం చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, టెస్టుల్లో 200 వికెట్లను అత్యంత వేగంగా తీసిన భారత మూడో పేసర్‌గా, మొత్తంగా ఐదో ఇండియన్‌గా రికార్డు సాధించాడు.
ఇక షమి కంటే ముందు కపిల్ దేవ్ 50 టెస్టుల్లో ఈ ఘనతను సాధించాడు. అలాగే జవగల్ శ్రీనాథ్ 54 టెస్టు్ల్లో 200 వికెట్లు తీయగా, ఇపుడు షమీ 55 టెస్టుల్లో 200 వికెట్లు తీశాడు.
సెంచూరియన్ టెస్ట్ : సౌతాఫ్రికా 197 ఆలౌట్
సెంచూరియన్ పార్కు మైదానంలో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన సౌతాఫ్రికా జట్టు కేవలం 197 పరుగులకే ఆలౌట్ అయింది.
దీంతో భారత్‌కు 130 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది. ఈ ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఐదు వికెట్లతో రాణించి సౌతాఫ్రికా ఆటగాళ్ల వెన్ను విరిచాడు. తద్వార 200 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. అలాగే, బుమ్రా, శార్దూల్ ఠాకూర్‌కు రెండేసి వికెట్లు, సిరాజ్‌కు ఒక వికెట్ లభించింది. సౌతాఫ్రికా ఆటగాళ్లలో టెంబా బవుమా 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే, డికాక్ 34, రబాడా 25, జాన్సెన్ 19 చొప్పున పరుగులు చేశాడు.
ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్ చేపట్టి తొలి వికెట్‌ను కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 140 పరుగుల ఆధిక్యంతో కలుపుకుంటే మొత్తం 143 పరుగుల లీడ్‌లో ఉంది.