సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఐపీఎల్ 2024 : ముంబైపై కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ

kkr team
ఐపీఎల్ 2024 సీజన్ పోటీల్లో భాగంగా, శనివారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తన ప్రత్యర్థి ముంబై ఇండియన్స్ జట్టుపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. కోల్‌కతా నిర్ధేశించిన 158 పరుగుల విజయలక్ష్య ఛేదనలో ముంబై 8 వికెట్లు కోల్పోయి కేవలం 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కేకేఆర్ జట్టు 18 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ముంబై బ్యాటర్లు ఆరంభంలో దూకుడుగా ఆడినప్పటికీ చివరివరకు కొనసాగించలేకపోయారు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 7 ఓవర్లలో 65 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఇషాన్ 22 బంతుల్లో 40 పరుగులు బాదడంతో మ్యాచ్‌లో ముంబై పట్టుబిగించినట్టే కనిపించింది. కానీ ఆ తర్వాత కోల్‌‌కతా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ మ్యాచ్‌ను మలుపుతిప్పారు. కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, ఆండ్రూ రస్సెల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా సునీల్ నరైన్ ఒక వికెట్ తీశాడు.
 
కాగా వర్షం కారణంగా 2 గంటలు ఆలస్యంగా ఆరంభమవడంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆరంభంలోనే ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ వికెట్లను కోల్పోయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆదుకున్నారు. 
 
వెంకటేష్ అయ్యర్ 21 బంతుల్లో 42 పరుగులు బాది ఆ జట్టు భారీ స్కోర్ సాధించడంలో తోడ్పడ్డాడు. ఆ తర్వాత నితీశ్ రాణా (33), రస్సెల్స్ (24), రింకూ సింగ్ (20) చొప్పున కీలకమైన పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రా, చావ్లా చెరో రెండు వికెట్లు, ఎన్ తుషారా, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కతా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.