శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జులై 2020 (15:36 IST)

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి : శ్రీలంక క్రికెటర్ అరెస్టు

ఓ రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు చనిపోయిన ఘటనలో శ్రీలంక యువ క్రికెటర్‌ను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. ఆ క్రికెటర్ పేరు కుశాల్ మెండీస్ (25). కొలంబో శివారు ప్రాంతం పనాదురాలో ఓ వృద్ధుడు (64) సైకిల్‌పై వెళుతుండగా, అటుగా కారులో వచ్చిన కుశాల్ మెండిస్ ఆ వృద్ధుడి సైకిల్‌ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వృద్ధుడు చనిపోయాడు. 
 
ఈ ఘటన ఆదివారం వేకువజామున జరిగింది. కుశాల్ మెండిస్ గత కొంతకాలంగా శ్రీలంక జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పటివరకు 44 టెస్టులు, 76 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే శ్రీలంకలో లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సాధన చేసేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి కారకుడైనట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం మెండిస్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.