గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (19:48 IST)

పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై కరోనా పంజా.. 10మంది క్రికెటర్లకు పాజిటివ్

పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై కరోనా పంజా విసిరింది. పాకిస్తాన్ మాజీ క్రికెట్ షాపిద్ అఫ్రిది ఇప్పటికే కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ పర్యటనకు ముందే పాకిస్థాన్ జట్టుకు గట్టిదెబ్బ తగిలినట్లైంది. ఆటగాళ్లంతా వరుసగా కోవిడ్ బారినపడుతున్నారు. సోమవారం ముగ్గురు కరోనా బారినపడ్డారు. 
 
తాజాగా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) అధికారికంగా ప్రకటించింది. సోమవారం హైదర్ అలీ, హారిస్ రవుఫ్, షాదబ్ ఖాన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఇవాళ ఫకార్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కషీఫ్ భట్టి, మహమ్మద్ హఫీజ్, మహమ్మద్ హస్నేన్, మహమ్మద్ రిజ్వాన్, వాహబ్ రియాజ్‌కు కూడా కరోనా బారినపడినట్లు నిర్ధారణ అయింది. ఫలితంగా 10మంది క్రికెటర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కానీ కరోనా సోకిన పాకిస్థాన్ క్రికెటర్లలో ఎలాంటి కరోనా లక్షణాల్లేవ్. 
 
త్వరలోనే ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనున్న నేపథ్యంలో జట్టు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేసింది పీసీబీ. ఈ పరీక్షల్లో ఇప్పటి వరకు 10మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన పీసీబీ అధికారులు వారితో సన్నిహితంగా మెలిగిన వివరాలు సేకరిస్తున్నారు.