మొతేరా స్టేడియంలో ఎన్ని పిచ్‌లు ఉన్నాయి.. ఫైనల్‌కు ఏ పిచ్ వాడుతారు?
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, 19వ తేదీ ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. ఈ పోటీకి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం (మొతేరా) ఆతిథ్యమివ్వనుంది. అయితే, ఈ స్టేడియం పిచ్‌పై ఇపుడు రసవత్తరం చర్చ సాగుతుంది. దీనికి కారణం ఈ స్టేడియంలో ఏకంగా 11 పిచ్‌లు ఉండటమే.
ఈ మొత్తం పిచ్‌లలో ఒకటి నుంచి అయిదు పిచ్‌లు నల్లమట్టితో తయారు చేసినవి కావడం గమనార్హం. 6 నుంచి 11 పిచ్‌లు ఎర్రమట్టితో తయారు చేసినవి. నల్లమట్టితో తయారు చేసిన పిచ్‌లపై బౌన్స్ లభిస్తుంది. అదేసమయంలో ఎర్రమట్టితో కూడుకున్న పిచ్‌లు మాత్రం మందకొడిగా మారతాయి. ఇపుడు ఈ ఫైనల్ కోసం ఏ పిచ్‌ను వాడుతారన్నది ఇపుడు చర్చగా మారింది.
ఈ ప్రపంచకప్ ఇప్పటివరకైతే ఇక్కడి పిచ్ బ్యాటింగ్, బౌలింగు సమానంగా సహకరించింది. ఈ టోర్నీలో ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్ ఛేదనలో జట్లు మూడు నెగ్గాయి. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మొదట ఆస్ట్రేలియా చేసిన 286 పరుగులే ఈ టోర్నీలో ఇక్కడ అత్యధిక స్కోరు. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మొదట 282 పరుగులు చేయగా.. ఛేదనలో న్యూజిలాండ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 36.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్న సంగతి తెలిసిందే.
ఇక్కడ పాకిస్థాన్‌ను మొదట 191 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఛేదనలో మూడు వికెట్లే కోల్పోయి 30.3 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. ఓవరాల్గా ఇప్పటివరకూ ఇక్కడ 32 వన్డేలు జరిగితే.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 17, ఛేదన జట్టు 15 మ్యాచ్ గెలిచాయి. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 237 మాత్రమే.
మరోవైపు, న్యూజిలాండ్‌తో భారత్ సెమీస్ కోసం వాంఖడేలో చివరి నిమిషంలో తాజా పిచ్‌కు బదులు వాడిన పిచ్‌పై మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. కానీ తాజా పిచ్‌పైనే మ్యాచ్ నిర్వహించాలనే నిబంధన ఏమీ లేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేస్తూ ఈ వివాదానికి తెరదించింది.