మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (19:49 IST)

కంగారులపై భారత క్రికెటర్ అరుదైన రికార్డు.. ఏంటది?

rohit sharma
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఇపుడు మూడో టెస్ట్ మ్యాచ్‌ను ఆడుతోంది. అయితే, మొదటి రెండు మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ... ఇపుడు కంగారులపై ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. పైగా, ఇది ఏ ఒక్క ఆటగాడూ ఇలాంటి రికార్డును నమోదు చేయకపోవడం గమనార్హం. 
 
బంగ్లాదేశ్‌తో టెస్ట్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ మరో టెస్ట్ మ్యాచ్ ఆడటం ఇదే కావడం గమనార్హం. అయితే తన పునరాగమనంలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆసీస్ జట్టుపై ఎవరికీ సాధ్యం కాని ఘనతను తాను సాధించాడు. కంగారూలపై అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సిక్సర్లు బాదిన ఏకైక ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు.
 
సిడ్నీ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో రోజున తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో కొట్టిన సిక్సుతో హిట్ మ్యాన్ ఈ ఘనత అందుకున్నాడు. 
 
ఈ జాబితాలో రోహిత్ తర్వాత ఆసీస్‌పై అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో ఇయాన్ మోర్గాన్ (63), బ్రెండన్ మెకల్లమ్ (61), సచిన్ టెండూల్కర్ (60), ఎంఎస్ ధోనీ (60) ఉన్నారు. 
 
ఇక, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో కొట్టిన సిక్సర్ల సంఖ్య 424కి పెరిగింది. మొత్తంగా చూసుకుంటే అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ కంటే ముందు క్రిస్ గేల్, షాహిద్ అఫ్రిది మాత్రమే ఉన్నారు. గేల్ 534 సిక్సులు బాదగా, అఫ్రిది 476 సిక్సర్లు సంధించాడు.