శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (16:40 IST)

దశాబ్దపు వన్డే - టీ20 జట్ల కెప్టెన్‌గా ధోనీ - టెస్టు సారథిగా విరాట్ కోహ్లీ

దశాబ్దకాలంలో అంటే గత పదేళ్ళ కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదివారం సాయంత్రం వెల్లడించింది. దశాబ్దపు పురుషుల, మహిళల టీ20, వన్డే జట్లను ఐసీసీ ఆదివారం ప్రకటించింది. 
 
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మాజీ సారథి, వరల్డ్‌కప్‌ల విన్నింగ్‌ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ టీ20, వన్డే జట్లకు నాయకుడిగా ఎంపికయ్యాడు. భారత స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, బుమ్రా, విరాట్‌ కోహ్లీ జట్టులో చోటుదక్కించుకున్నారు. 
 
సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌, టీ20 లెజెండ్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ వంటి ఆరుగురు హిట్టర్లు ఇందులో ఉన్నారు. దశాబ్దపు పురుషుల టెస్టు టీమ్‌ కెప్టెన్‌గా రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ ఎంపికయ్యాడు. 
 
అలాగే, ఐసీసీ టీ20 జట్టులో భారత్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకోగా, విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా స్థానం దక్కించుకున్నారు. వీరేకాకుండా, సఫారీ విధ్వంసక క్రికెటర్ ఏబీ డివిలియర్స్, కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్), లసిత్ మలింగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్) జట్టులోని ఇతర సభ్యులు. 
 
అదేవిధంగా ఈ దశాబ్దపు టెస్టు జట్టుకు సారథిగా విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. ఈ జట్టులో భారత్ నుంచి రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా స్థానం దక్కింది. ఇవే కాకుండా మహిళల విభాగాల్లోనూ ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. అందులో మిథాలీరాజ్ (టెస్టు), ఝులాన్ గోస్వామి (టెస్టు), హర్మన్ ప్రీత్ (టీ20), పూనమ్ యాదవ్ (టీ20) లకు స్థానం లభించింది.
 
టెస్టు టీమ్‌: అలిస్టర్‌ కుక్‌, డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, విరాట్ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌, సంగక్కర(వికెట్‌ కీపర్‌), బెన్‌ స్టోక్స్‌, అశ్విన్‌, డేల్‌ స్టెయిన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌. 
 
టీ20 టీమ్‌: రోహిత్‌ శర్మ, క్రిస్‌గేల్‌, అరోన్ ఫించ్‌, విరాట్‌ కోహ్లీ, డివిలియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ధోనీ, పొలార్డ్‌, రషీద్‌ ఖాన్‌, బుమ్రా, మలింగ. 
 
వన్డే టీమ్‌: రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌, కోహ్లీ, డివిలియర్స్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, ధోనీ(వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), బెన్‌స్టోక్స్, మిచెల్‌ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, మలింగ.