అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....
ఓ యువతి ఎక్కిన ర్యాపిడో బైక్ మార్గమధ్యంలో బ్రేక్ డౌన్ అయింది. అపుడు సమయం అర్థరాత్రి. పైగా, చుట్టుపక్కలా ఒక్క మనిషి కూడా కనిపించలేదు. నిర్మానుష్య ప్రాంతం. అలాంటి సమయంలో ఏ కెప్టెన్ అయినా రైడ్ రద్దు చేసుకుని వెళ్లిపోతాడు. కానీ, ఈ రాపిడో కెప్టెన్ మాత్రం అలా చేయకుండా, భయంతో వణికిపోతున్న ఆ యువతికి భరోసా ఇచ్చాడు. భయపడొద్దంటూ ధైర్యం చెప్పాడు. పైగా, క్షేమంగా ఇంటికి చేరుస్తానంటూ హామీ ఇచ్చాడు. ఆ తర్వాత తాను చెప్పినట్టుగానే ఆ యువతిని క్షేమంగా ఇంటికి చేర్చాడు.
దీన్ని వీడియో తీసిన ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఐటీ నగరం బెంగుళూరులో జరిగింది. మహిళలకు భద్రత లేదంటూ సాగుతున్న ప్రచారం తప్పని ఈ సంఘటన తాజాగా నిరూపితమైంది. పైగా, భద్రత అనేది పరిస్థితుల వల్ల కాదు... మనం కలిసే మనుషుల వల్లే వస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం.
ఆశా మానే అనే యువతి రాత్రి 11.45 గంటల సమయంలో 38 కిలోమటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్ళేందుకు రాపిడో బుక్ చేసుకుంది. ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే వారి బైక్ ఓ గుంతలో పడటంతో చైన్ తెగిపోయింది. ఆ సమయంలో చుట్టూ నిర్మానుష్య ప్రాంతం. సమీపంలో మెకానిక్ షాపు కూడా లేని సమయంలో ఆమె ఆందోళనకు గురయ్యారు.
ఇలాంటి పరిస్థతుల్లో సాధారణంగా రైడ్ రద్దు చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఆ కెప్టెన్ మాత్రం అలా చేయలేదు. మీరు కంగారుపడకండి. దీన్ని సరిచేసి మిమ్మలను ఇంటి దగ్గర దింపుతాను అని అతను చెప్పడంతో తాను చలించిపోయానని ఆ యువతి తన ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బైకును రిపేర్ చేశారు. అక్కడ నుంచి ఆమెను రాత్రి ఒంటిగంట సమయంలో సురక్షితంగా దింపారు.
ఈ సంఘటనపై రాపిడో సంస్థ కూడా స్పందించింది. నిజమైన హీరోకు కేప్స్ ఉండవు. కొందరు అర్థరాత్రి వీధిలైట్ల వెలుతురులో బైక్ చైన్ సరిచేసి మిమ్మలను సురక్షితంగా ఇంటికి చేరుస్తారు. అతనికి తప్పకుండా గుర్తింపు ఇస్తాం అని హామీ ఇచ్చారు. ప్రయాణ భద్రతపై నెగెటివ్ కథనాలు వస్తున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి సానుకూల సంఘటనలు మానవత్వంపై నమ్మకాన్ని పెంచుతున్నాయి.